ఎకో ఇండియా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఎకో ప్రాజెక్డ్ పై రెండు రోజుల సదస్సు జరుగుతోంది.. ఈ సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె. నివాస్, ఎకో ప్రాజెక్ట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డా.సందీప్ భల్లా తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ.. ఎకో ఇండియా సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్నట్లు వెల్లడించారు.. ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ సంస్ధ పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తుందని తెలిపారు.. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని విజయవంతం చేయడానికి వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ 6 నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇక, గర్బిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి వైద్య సేవలు పకడ్బందీగా నిర్వహించేలా శిక్షణ ఉంటుందన్నారు కృష్ణబాబు.. ఎకో ప్రాజెక్ట్ పై రెండు రోజుల సదస్సుని విజయవాడలో నిర్వహిస్తున్నాం.. ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకి మరింత మెరుగైన వైద్యం అందుతుంది.. రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించాం.. గ్రామీణ స్ధాయిలో మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకి ప్రత్యేక శిక్షణ ఇస్తాం అన్నారు.. గ్రామ స్ధాయిలోనే దాదాపు 80 శాతం రోగాలకి చికిత్స అందించగలగాలనేది తమ ప్రయత్నం.. ఏపీలో మెరుగైన వైద్య సదుపాయాల ద్వారా ముందస్తు రోగ నివారణ సాధ్యం అన్నారు. రాష్ట్రంలో 48 వేల మందివైద్య సిబ్బందిని గత రెండున్నర ఏళ్లలో నియమించాం.. వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే ఏపీ రోల్ మోడల్ కాబోతోందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభించిన తర్వాత ప్రతీ వ్యక్తి యొక్క ఆరోగ్య డేటా నిర్వహిస్తున్నాం.. అత్యాధునిక టెక్నాలజీని వైద్య రంగంలో వినియోగించుకోవాలని సూచించారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు.
ఇక, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ జె.నివాస్ మాట్లాడుతూ.. దేశంలో వైద్య ఆరోగ్య విభాగాన్ని బలోపేతం చేయడంలో భాగమే ప్రాజెక్ట్ ఎకో అన్నారు. జాతీయ హెల్త్ మిషన్ లో భాగంగా వైద్య సిబ్బందికి ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ ఇస్తాం అన్నారు.. మాతా శిశు సంరక్షణ, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పెంచడం, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ లో భాగంగా జరుగుతుందన్నారు.. ఈ ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకి మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోనున్నట్టు జె.నివాస్ వెల్లడించారు.