Amrit Kalash Yatra: ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నా మట్టి నా దేశం కార్యక్రమం ముగింపు దశకు చేరింది.. దీంతో, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అమృత్ కలశ యాత్ర ప్రారంభమైంది.. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లోని 680 మండలాలు, 125 మున్సిపాల్టీలలోని ప్రజల నుంచి మట్టి, బియ్యం సేకరించిన కలశాలతో అమృత్ కలశ యాత్ర ట్రైన్ ప్రారంభమైంది.. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎమ్ నరేంద్ర పాటిల్, మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు పాల్గొన్నారు. అమృత్ కలశ యాత్ర రైలును జెండా ఊపి ప్రారంభించారు రైల్వే డీఆర్ఎమ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అధికారులు..
ఇక, జాతీయ జెండాలతో రైల్వే స్టేషన్‌లో ప్రదర్శన నిర్వహించారు విద్యార్ధులు.. ఈ సందర్భంగా రైల్వే డీఆర్ఎమ్ నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ.. మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.. ప్రధాని పిలుపు మేరకు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి మట్టిని సేకరించి ఢిల్లీకి పంపిస్తున్నాం అన్నారు.. మేరీ మాటీ – మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో వందలాది మంది చిన్నారులు జాతీయ పతాకాలతో దేశభక్తిని ప్రదర్శించారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అమృత్ కలశ యాత్ర విజయవాడ నుంచి ప్రారంభమైంది. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రారంభమైంది. ఢిల్లీలో నిర్మించే అమృత్ వాటికకు ఏపీ నుంచి 650 అమృత్ కలశాలను పంపించామని వెల్లడించారు.. దేశమంతా ఒక్కటే అనేలా ఈ కార్యక్రమం సాగుతోంది. అన్ని కులాల ఐక్యతతోనే భారదేశ నిర్మాణం జరిగిందన్నారు. చిన్నారులు చాలా ఉత్సాహంగా అమృత్ కలశ యాత్రలో పాల్గొన్నారు.. ఐకమత్యాన్ని చాటి చెప్పేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు వెల్లంపల్లి శ్రీనివాసరావు.