Amit Shah Srinagar Visit: జమ్మూకశ్మీర్ నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా, 31 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం శ్రీనగర్‌ను సందర్శించే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. అమిత్ షా సాయంత్రం శ్రీనగర్ చేరుకుంటారని వర్గాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలానికి చేరకుని పోలీస్ స్టేషన్ లోపల జరిగిన పేలుడు సంఘటన గురించి షా ఆరా తీయనున్నారు.
READ MORE: Shiva Re-release: 10 కొత్త సినిమాలు రిలీజైతే .. రీ రిలీజ్ సినిమా చూస్తున్నారు
జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుడు శబ్ధం కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. పోలీస్ స్టేషన్ భవనంలోని ఓ భవన భాగం కూలిపోయింది. అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. మానవ అవశేషాలు 300 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. నౌగామ్ పేలుడు తర్వాత జమ్మూకశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. డీజీపీ నళిన్ ప్రభాత్ హైబ్రిడ్ భద్రతా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం రాత్రి 11:22 గంటలకు జరిగిన ఈ పేలుడులో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించారు. గాయపడిన 30 మంది ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పేలుడు చాలా తీవ్రంగా ఉంది. మంటలు, పొగ ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా రెస్క్యూ బృందాలు దాదాపు గంటసేపు లోపలికి ప్రవేశించడానికి ఇబ్బంది పడ్డాయి. కాగా.. ఇటీవల హర్యానా, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొని నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ పేలుడు పదార్థాల నుంచి నమూనాలను తీస్తుండగా విస్ఫోటం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.