Amit Shah: యువకుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడిన అమిత్ షా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం నడుస్తోందని.. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. కేసీఆర్ చెవులు పెట్టి విను.. జైళ్లకు పంపిస్తే బీజేపీ కార్యకర్తలు భయపడరంటూ కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. బండి సంజయ్‌ను జైలులో పెడితే 24 గంటల్లో బెయిల్‌పై బయటకు వచ్చారని.. బండి సంజయ్ పేపర్ లీకేజీపై మాట్లాడినందుకు ఆయన్ను జైలుకు పంపించారని మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆడుకున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ను ఓడించేందుకు సిద్దంగా ఉన్నారని..ఒక పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించని ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కేసీఆర్ ఎవరిని రక్షించాలని అనుకుంటున్నారని.. ఎందుకు మాట్లాడడం లేదని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అమిత్ షా పేర్కొన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే… అవినీతి పరులను జైలుకు పంపిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోనే కేసీఆర్ పని అయిపోతుందని.. దేశం గురించి ఏమీ మాట్లాడుతారంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని.. 2024లో ప్రధాని కుర్చీ ఖాళీగా లేదన్నారు. “కేసీఆర్.. ప్రధాని సీటు ఖాళీగా లేదు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని. కేసీఆర్.. ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలు. అధికారంలోకి వస్తే విమోచన దినం ఘనంగా నిర్వహిస్తాం. మజ్లిస్‌కు బీజేపీ భయపడేది లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉంది.” అమిత్ షా అన్నారు.
Read Also: Punjab CM Bhagawant Mann: మార్చిలోనే అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేసి ఉండొచ్చు.. కానీ..!
పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌లు కేసీఆర్‌కు ఏటీఎంలుగా మార్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ నీ జులుం బంద్ చెయ్యి.. ఉన్న ఈ టైమ్‌లో ప్రజల కోసం పని చెయ్యి అంటూ అమిత్ షా మాట్లాడారు. దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన అమిత్ షా.. గొంతు సహకరించక పోవడంతో ఇబ్బంది పడ్డారు. వేట మొదలైంది.. వేటాడానికే పులి వచ్చిందని.. కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని అమిత్ షా అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, ఫస్ట్ తారీఖే జీతాలిస్తామని అమిత్ షా అన్నారు.