పాకిస్థాన్ ఎన్నికల పంచాయితీ అగ్రరాజ్యం అమెరికాకు చేరింది. గత నెలలో పోలింగ్ జరిగి.. కౌంటింగ్ ముగిసినా ఇప్పటిదాకా కొత్త ప్రభుత్వం మాత్రం ఏర్పడలేదు. గత కొద్దిరోజులుగా రిగ్గింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఏ పార్టీకి ప్రజలు అక్కడ సంపూర్ణ మద్దతు తెల్పలేదు. ఇమ్రాన్‌ఖాన్-నవాజ్ షరీఫ్ పార్టీలు ఎవరికి వారే రిగ్గింగ్ జరిగిందంటూ ఆందోళనలు చేపట్టారు. అనంతరం సైన్యం జోక్యంతో నవాజ్ షరీఫ్ పార్టీకి అవకాశం లభించింది. భుట్టో-షరీఫ్ కలయికతో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. అయితే ఇమ్రాన్‌ఖాన్ పార్టీ నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రిగ్గింగ్‌పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ యవ్వారం అమెరికాకు చేరింది.
పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను పాలక డెమోక్రటిక్ చట్టసభ్యులు కోరారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని అధ్యక్షుడు జో బైడెన్‌ను పాలక డెమోక్రటిక్ చట్టసభ్యులు కోరారు.
ఫిబ్రవరి 8న జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు గురువారం పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ పరిణామాల మధ్య అగ్రరాజ్య చట్టసభ్యుల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
లేఖలో..
పోలింగ్‌కు ముందు, తర్వాత రిగ్గింగ్ జరిగిందనే దానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తు జరిగేవరకు వేచి చూడాలని కోరారు. అంతవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని.. లేనిపక్షంలో ఆ దేశాధికారుల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సమర్థించినట్లవుతుందని తెలిపారు. లేఖలో చట్టసభ సభ్యులు పేర్కొన్నారు. మొత్తం 33 మంది కీలక డెమోక్రాట్‌లు ఈ లేఖపై సంతకాలు చేశారు.