Virat Kohli is Fitness Benchmark for Team India: భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఓ అద్భుతమని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ తోపు అని, భారత జట్టుకు మార్గదర్శి అని పేర్కొన్నారు. టెస్ట్ రిటైర్మెంట్ విషయంలో కింగ్ కాస్త తొందరపడ్డాడని, ఇంకొన్నేళ్లు విరాట్ టెస్ట్ క్రికెట్ ఆడాల్సిందని రాయుడు అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో కింగ్ అత్యధిక స్కోర్ 254 నాటౌట్.
ఓ పాడ్‌కాస్ట్‌లో అంబటి రాయుడు మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు. ‘విరాట్ కోహ్లీ భారత్ కోసం ఎంతో చేశాడు. భారత జట్టు వచ్చే వందేళ్లలో ఆధిపత్యం చెలాయించేలా అతడు బాటలు వేశాడు. కోహ్లీకి ఎంతో నైపుణ్యం ఉంది. అంతేకాదు అద్భుత ఫిట్‌నెస్ సొంతం. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే మానసికంగా కూడా బలంగా ఉంటారు. కోహ్లీ మంచి బ్యాటర్ మాత్రమే కాదు, ఫిట్‌నెస్ విషయంలో భారత జట్టుకు మార్గదర్శి కూడా. కోహ్లీ వల్లే భారత జట్టు ఫిట్‌నెస్‌లో అత్యున్నత ప్రమాణాలను అందుకుంది. ఫిట్‌నెస్‌లో కోహ్లీని మించిన క్రికెటర్ లేదనే చెబుతా. అతడి నైపుణ్యంకు ఫిట్‌నెస్ అదనపు బలం అయింది’ అని రాయుడు కొనియాడారు.
Also Read: Asia Cup 2025: శుభ్‌మన్ గిల్ ప్లానింగ్‌లో లేడు.. బాంబ్ పేల్చిన మాజీ క్రికెటర్!
‘టెస్ట్ రిటైర్మెంట్ విషయంలో విరాట్ కోహ్లీ కాస్త తొందరపడ్డాడు. నా ఉద్దేశం ప్రకారం కాస్త తొందరగానే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో భాగమై ఉంటే బాగుండేది. ఫిట్‌నెస్ పరంగా చూస్తే విరాట్ ఇంకొన్నేళ్లు క్రికెట్ ఆడగలడు. అంతా జరిగిపోయింది. ప్రస్తుతం విరాట్ సంతోషంగానే ఉన్నాడు అని నేను అనుకొంటున్నా. వన్డేల్లో అయినా ఇంకొన్నేళ్లు ఆడాలని ఆశిస్తున్నా’ అని అంబటి రాయుడు తెలిపారు. కోహ్లీ రిటైర్మెంట్‌కు కారణం కోచ్ గౌతమ్ గంభీర్ ప్రధాన కారణం అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.