Ambati Rambabu: ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తోందని.. 410 మంది ఉద్యోగులను ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇస్తాం అని చెప్పిన భృతి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. వైసీపీ మీద కోపం ఉంటే మాతో పోరాడండి.. అంతే కాని మా ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు పీకేయకండి అంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వాలంటీర్లను, ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శలు గుప్పించారు. ఈ నెల 27న పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి దానికి వైఎస్ జగన్‌పై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడానికి ఎవరు కారణమని ఆయన ప్రశ్నించారు.
Read Also: AP New CS: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఎవరు?.. సీఎం చంద్రబాబు ఆలోచన ఏంటి?
కూటమి పార్టీలు ఎన్నికల కు ముందు అనేక హామీలు ఇచ్చారని.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బాదుడే బాదుడు అని చెప్పి అధికారంలోకి వచ్చి రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీలు బాదారని విమర్శించారు. ఆ రోజు స్మార్ట్ మీటర్లు పగల కొట్టమని చెప్పిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు ఎందుకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని అడిగారు. గ్రామాల్లో ఉన్న రోడ్లపై కూడా టోల్ వసూలు చేస్తారంట.. ఇదేనా సంపద సృష్టించడం అంటే.. అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అప్పుల కోసం చిప్ప పట్టుకుని తిరుగుతున్నారని.. అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపే స్థితికి వచ్చారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఆదాయం పడిపోయిందన్నారు.