AP New CS: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఎవరు?.. సీఎం చంద్రబాబు ఆలోచన ఏంటి?.. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితి పాలనా వ్యవహారాలకు సంబంధించి సీఎం చంద్రబాబు సీఎస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు.. సూపర్ సిక్స్ అమలు, రాజధాని నిర్మాణం ఈ అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో సీఎస్ పాత్ర చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఉన్న సీఎస్ పదవీకాలం ఈ నెల 31తో ముగుస్తుంది. దీంతో కొత్త సీఎస్ ఎవరు.. సీనియారిటీ ప్రకారం ఎవరికి ఇవ్వాలి.. అనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతానికి సీనియారిటీ లిస్ట్‌లో ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు దృష్టిలో ఎవరున్నారనే ఉత్కంఠ కలుగుతోంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌కు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 7న సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న నీరబ్ కుమార్ ప్రసాద్ ఆరు నెలల పాటు సీఎస్ పదవి కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో ఆ మేరకు అనుమతులు రావడంతో ఆయన సీఎస్‌గా ఇప్పటి వరకూ కొనసాగారు. మరోసారి ఇంకో ఆరు నెలలు పొడిగించేందుకు అవకాశం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ దిశగా ప్రయత్నాలేమీ జరగడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరుకు నీరబ్ కుమార్ పదవీ విరమణ ఖాయం అయినట్టు స్పష్టత వచ్చింది. ఈ క్రమంలో కొత్త సీఎస్ ఎవరనే చర్చ సచివాలయ, అధికారిక వర్గాల్లో జరుగుతోంది.
Read Also: Tirupati: అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ.. హిందూ సంఘాల నిరసన
సీనియరిటీ ప్రకారం చూస్తే ఏడు, ఎనిమిది మంది పేర్లు ప్రధాన కార్యదర్శుల జాబితాలో ఉన్నాయి. సీనియారిటీ ప్రకారం సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మీ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరామ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, కేంద్ర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌లు ఉన్నారు. వీరిలో వైసీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన శ్రీలక్ష్మీ, అజయ్ జైన్‌లను సీఎస్ ఎంపిక పరిశీలనలోకే సీఎం తీసుకోకపోవచ్చు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా పేరు పరిశీలనలోకి వస్తుందా.. రాదా అనేది కూడా చూడాల్సి ఉంది. మిగిలిన ఐదుగురిలో పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి సీఎం ప్రాధాన్యం ఇస్తారా.. లేక.. సీనియారిటీతో పాటు పాటు పాలనాపరంగా వ్యూహత్మక నిర్ణయాలు తీసుకునేవారికి పాధాన్యం ఇస్తారా.. అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
Read Also: Sandhya Theater Case : సంధ్య థియేటర్ కేసులో A1 నుంచి A18వరకు ఎవరెవరంటే..?
సీనియారిటీ ప్రకారం ఐఏఎస్‌ల సర్వీసును పరిశీలిస్తే శ్రీలక్ష్మీ 1988 బ్యాచ్‌కు చెందిన అధికారిణి గా ఉన్నారు. ఉన్న వారిలో ఈవిడే సీనియర్. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈమె నుంచి అభినందనలు స్వీకరించడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడలేదనే చర్చ జరుగుతోంది. అనంత్ రామ్ 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. సాయి ప్రసాద్, సిసోడియా, అజయ్ జైన్, సుమితా దావ్రా లు 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు కాగా, విజయానంద్, బుడితి రాజశేఖర్‌లు 1992 బ్యాచ్ అదికారులు. విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేయనుండగా… సాయిప్రసాద్ 2026 మేలోనూ, సిసోడియా 2028 జనవరిలోనూ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లెక్కన సిసోడియాకు మరో 3 సంవత్సరాల సర్వీసు ఉంది. దీంతో ముందుగా పదవీ విరమణ చేసే వారి జాబితాలో విజయానంద్ ఉండగా… ఆ తర్వాత వరుసలో సాయిప్రసాద్ ఉన్నారు. శ్రీలక్ష్మీ తరువాత సీనియర్‌గా ఉన్న అనంత్ రామ్ ఏ మేర ప్రభుత్వ పాలనా విభాగాన్ని సమన్వయం చేయగలరు అనే సందేహాలు కూడా ఉన్నాయి.
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియారిటీతో సంబంధం లేకుండా ముందుగా పదవీ విరమణ చేసే వారికి అవకాశం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఈ కీలకమైన తరుణంలో పాలనతో పాటు వ్యూహత్మక నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్ళడంతో పాటు ఉద్యోగులను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం కూటమి సర్కార్‌కు ఎంతయినా ఉంది. దీంతో అలా అన్ని అంశాల్లో ఫిట్ అయ్యే వారికే ఈసారి సీఎస్‌గా అవకాశం ఉంటుందని తెలుస్తోంది.