Amazon Layoffs: ఐటీ రంగంలో మరోసారి ఉద్యోగాల కోత వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఒరాకిల్ వంటి సంస్థ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ప్రముఖ ఇ-కామర్స్, టెక్ దిగ్గజం అమెజాన్ కూడా కలిసినట్లు సమాచారం. అమెజాన్ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు ప్లాన్ చేస్తోందని టాక్ నడుస్తుంది. తాజా నివేదికల ప్రకారం.. కంపెనీ వివిధ విభాగాల్లో సుమారు 14,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కాలంగా సాగుతున్న ఈ లేఆఫ్స్ పరంపరలో ఇది మూడవ విడత కావడం గమనార్హం.
READ ALSO: Ground Report: అభివృద్ధికి చిరునామాగా మారుతున్నా వరంగల్ జిల్లా కర్రెగుట్టలు
ఏ విభాగాలపై ప్రభావం అంటే..
ఆసియా బిజినెస్ అవుట్ లుక్ నివేదిక ప్రకారం.. ఈ లేఆఫ్స్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండనుందని సమాచారం. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్ విభాగం, హెచ్ఆర్ (HR) విభాగాల్లో పనిచేసే మిడ్-లెవల్ మేనేజర్లు, వైట్ కాలర్ ఉద్యోగులపై ఈ వేటు పడే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. అంతేకాకుండా, చైనాలోని కొన్ని ప్రత్యేక విభాగాలను కూడా కంపెనీ పూర్తిగా మూసివేసే అవకాశం ఉందని టాక్. అమెజాన్ తన వ్యూహాలను మార్చుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. డేటా సెంటర్ల కోసం దాదాపు 125 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తోంది. ‘జనరేటివ్ ఏఐ’ రాకతో కొన్ని రకాల ఉద్యోగాల అవసరం తగ్గుతుందని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ గతంలోనే అభిప్రాయపడ్డారు.
టెక్కీల్లో భయం..
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’లో ఒక యూజర్ మే నెలలో భారీ తొలగింపులు ఉండబోతున్నాయంటూ పోస్ట్ చేయడంతో ఉద్యోగుల్లో భయం మొదలైంది. “ఈ వార్త విన్నప్పటి నుంచి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాను.. వేరే ఉద్యోగం చూసుకోవాలా?” అంటూ పలువురు ఉద్యోగులు తమ ఆవేదన కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు తొలగింపులు చేపడుతున్నారో స్పష్టత లేకపోవడం ఈ ఆందోళనకు ప్రధాన కారణం అని చాలా మంది చెబుతున్నారు. ఇటీవలే ఒరాకిల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించగా, అందులో 12,000 మంది భారతీయులే ఉండటం గమనార్హం. వీరితో పాటు మెటా కూడా మరో 15,000 మందిని తగ్గించుకోవాలని చూస్తోంది. మైక్రోసాఫ్ట్, టీసీఎస్, యాక్సెంచర్ వంటి కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మొత్తానికి ఐటీ రంగం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, అమెజాన్ తాజా నిర్ణయం భారతీయ టెక్కీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
READ ALSO: Anna Lezhneva: ఆయనే ఫస్ట్ ప్రపోజ్ చేశారు.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన పవన్ భార్య