Allu Arjun: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్ 1’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 2022లో విడుదలై సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకి సీక్వెల్‌గా కాకుండా, దానికి ముందు కథ (ప్రీక్వెల్)గా ఈ ‘కాంతార చాప్టర్ 1’ రూపొందించబడింది. హోంబాలే ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించగా, జయరామ్ మరియు గుల్షన్ దేవయ్య వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. రిలీజైనప్పటి నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. నిన్నటి వరకు ఈ చిత్రం ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు (రూ. 818 కోట్లు) కలెక్ట్ చేసినట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా ఇప్పుడు 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుండటం విశేషం. అంతేకాక, ఈ సినిమా యొక్క ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 31వ తేదీన విడుదల కానుంది.
READ MORE: Kurnool Bus Accident: దారుణం.. బస్సు లగేజీ క్యాబిన్‌లో రెండు మృతదేహాలు..
తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న రాత్రి ‘కాంతార చాప్టర్ 1’ సినిమాను వీక్షించి, చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన తెలిపారు. ట్వీట్‌లో అల్లు అర్జున్ ఏమన్నారంటే: “నిన్న రాత్రి #కాంతార చూశాను. వావ్, ఎంత అద్భుతమైన సినిమా. దాన్ని చూస్తూ నేను ట్రాన్స్లోకి వెళ్ళాను. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ గారికి అభినందనలు. ఆయన ప్రతి క్రాఫ్ట్‌లోనూ రాణించారు. రుక్మిణి గారు, జయరామ్ గారు, గుల్షన్ దేవయ్య గారు సహా ఇతరుల నటన గురించి చెప్పి తీరాల్సిందే. సాంకేతిక నిపుణుల అద్భుతమైన పని గురించి ముఖ్యంగా అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్షన్, అరుణ్ రాజ్ స్టంట్స్ టాప్ నాచ్. నిర్మాత విజయ్ కిరంగదూర్, మొత్తం హోంబాలే బృందానికి హృదయపూర్వక అభినందనలు. నిజాయితీగా చెప్పాలంటే, అనుభవాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు,” అంటూ అల్లు అర్జున్ సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.