‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనం ఎక్కేముందు తండ్రి అల్లు అరవింద్, సతీమణి స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ మాట్లాడారు. సతీమణి స్నేహకు ముద్దుపెట్టిన బన్నీ.. పోలీసులతో కలిసి వాహనం ఎక్కారు.
స్టార్ హీరో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 105 సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదైంది. అల్లు అర్జున్‌కు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు.