Aligarh Plane Crash: ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. పయనీర్ అకాడమీ శిక్షణ విమానం ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా కూలిపోయింది. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా, విమానం రన్‌వే సరిహద్దును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం వేగం తక్కువగా ఉండడంతో అదృష్టవశాత్తూ పైలట్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు విమానయాన శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ అగర్వాల్ తెలిపారు.
Read Also: India Pakistan War: మధ్య ఆసియా దేశం నుంచి భారత్ దాడి చేసే ఛాన్సుందా..? పాకిస్తాన్‌లో కొత్త భయం..
అందిన సమాచారం ప్రకారం, పయనీర్ అకాడమీ శిక్షణ విమానం నేడు (ఆదివారం) అలీఘర్ లోని ధనిపూర్ ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ అవుతోంది. ఈ సమయంలో సాంకేతిక లోపం కారణంగా.. విమానం బ్యాలన్స్ కోల్పోయి రన్‌వేపై నుంచి వెళ్లి పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం తీవ్రంగా దెబ్బతింది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది అక్కడే ఉండడంతో.. వారు పరిగెత్తి విమానంలో చిక్కుకున్న పైలట్‌ను సురక్షితంగా రక్షించారు. ఈ సోలో పైలట్ విమానం పయనీర్ అకాడమీకి చెందినదని విమానయాన శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ అగర్వాల్ తెలిపారు. ఈ విమానంలో కొత్త పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ విమానం పూర్తిగా దెబ్బతిందని ఆయన అన్నారు. ఈ ఘటన వెనుక గల కారణాలను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందో దర్యాప్తు తర్వాతే తెలుస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పాయల్ పర్వేష్ జైన్ విమానాన్ని ల్యాండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.