మూకుమ్మడి సిక్ లీవ్స్ కారణంగా ఎయిరిండియా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 100కు పైగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్ చెప్పింది. సామూహిక సిక్ లీవ్‌లో ఉన్న ఎయిరిండియా సిబ్బంది తిరిగి విధుల్లో చేరినట్టు ఆ సంస్థ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈనెల 14వ తేదీ (మంగళవారం) నుంచి అన్ని సర్వీసులు యథాప్రకారం నడుస్తాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP CEO: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..
మూకుమ్మడి సిక్ లీవులో ఉన్న సిబ్బంది మే 11వ తేదీన విధుల్లో చేరారని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే కంపెనీ షెడ్యూల్డ్ సాఫ్ట్‌వేర్‌లో లోపం కారణంగా స్టాఫ్ సిక్ లీవులో ఉన్నట్టు చూపుతోందని తెలిపింది. ప్రతిరోజూ సుమారు 380 విమాన సర్వీసులను ఎయిరిండియా నడుపుతుండగా.. ఆదివారం సుమారు 20 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్‌లైన్స్ నిర్వహణా లోపాల కారణంగా సిబ్బంది సమ్మెకు దిగడంతో గత మంగళవారం నుంచి వందలాది విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీంతో సయోధ్య కుదిర్చేందుకు చీఫ్ లేబర్ కమిషనర్ గురువారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. సిబ్బంది సమ్మె విరమణకు అంగీకరించగా, ఎయిర్‌లైన్స్ సైతం 25 మంది సిబ్బందికి జారీ చేసిన టెర్మినేషన్ లేఖలను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంది. ఎయిరిండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: మీరు ఆప్‌కి ఓటేస్తే నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు..