Indian Football Coach Igor Stimac Sacked: భారత సీనియర్ ఫుట్‌బాల్ టీమ్ హెడ్ కోచ్ ఇగర్ స్టిమాక్‌పై వేటు పడింది. రెండేళ్ల పదవీ కాలం ఉండగానే.. 56 ఏళ్ల స్టిమాక్‌ను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) తప్పించింది. 2026 ఫిఫా ప్రపంచకప్ కోసం ఇటీవల నిర్వహించిన క్వాలిఫయర్స్‌లో సులువైన డ్రా పడ్డప్పటికీ.. భారత్ మూడో రౌండ్లోనే నిష్క్రమించడంతో స్టిమాక్‌పై ఏఐఎఫ్‌ఎఫ్ చర్యలు తీసుకుంది. ఆదివారం జరిగిన ఏఐఎఫ్‌ఎఫ్ సమావేశంలో పాల్గొన్న టెక్నికల్ కమిటీ హెడ్ ఐఎం విజయన్, సాంకేతిక కమిటీ సభ్యుడు క్లైమాక్స్ లారెన్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని.. జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త కోచ్ అవసరమని సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇగర్ స్టిమాక్‌ను పదవి నుంచి తప్పిస్తూ నోటీసు జారీ చేశాం. స్టిమాక్ తక్షణమే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకొంటాడు’ అని ఏఐఎఫ్‌ఎఫ్ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కాంట్రాక్టును మధ్యలో రద్దు చేసినందుకు స్టిమాక్‌కు ఏఐఎఫ్‌ఎఫ్ రూ.3 కోట్ల చెల్లించాల్సి ఉంటుంది.
ఇగర్ స్టిమాక్ 2019లో భారత ఫుట్‌బాల్ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. 2023 అక్టోబరులో 2026 వరకు స్టిమాక్ పదవీ కాలాన్ని ఏఐఎఫ్‌ఎఫ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో స్టిమాక్‌పై వేటు పడింది. ఒప్పందం జూన్ 2026 వరకు ఉన్నందున స్టిమాక్ దీనిని అంగీకరించకపోవచ్చు అని ఫెడరేషన్ అధికారి ఒకరు అన్నారు. స్టిమాక్‌కు మూడు నెలల జీతం పరిహారంగా అందించబడింది.