ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్, ఈడీ కస్టడీపై పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెయిల్ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కోటి ఆశలు పెట్టుకుంది. మరీ ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వనుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇదిలా ఉంటే సోమవారం కూడా ఇదే పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బెయిల్ కోసం విచారణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారా? అని కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీని ప్రశ్నించింది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని, అందుకోసమే తాము ఎలాంటి పిటిషన్లు వేయలేదని ధర్మాసనానికి తెలిపారు. ఈడీ సమన్లకు స్పందించలేదన్న కారణంతో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం భావ్యం కాదని న్యాయవాది సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.
అయితే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు తొమ్మిదిసార్లు విచారణకు రావాలంటూ సమన్లను ఇచ్చినా వాటిని దాట వేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మసనానికి ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొంది. అలాగే PMLA సెక్షన్ 17 కింద తన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నప్పుడు.. అతడు తప్పించుకునేందుకు అనేక కారణాలు చెప్పేవారని ఈడీ తెలిపింది.
ఇది కూడా చదవండి: SSMB29 : మహేష్,రాజమౌళి మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఈడీ కస్టడీకి రెండు సార్లు ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అంతకముందు ఈడీ తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ స్పందించలేదు. అరెస్ట్ ప్రక్రియను అడ్డుకోలేమని కోర్టు తెలపడంతో ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: TS SSC Results 2024: నేడే టెన్త్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల