Rakul Preet Singh About Prabhas Movie: పెళ్లి అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. హిందీ పరిశ్రమలో ఇటీవల దశాబ్దకాలం పూర్తి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో చివరిసారిగా ‘కొండపొలం’ చిత్రంలో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన రకుల్ హవా ఇటీవలి కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను ‘రెబల్ స్టార్’ ప్రభాస్ సినిమా నుంచి చెప్పకుండా తీసేశారని తెలిపారు.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… ‘కెరీర్ ఆరంభంలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. సరైన బ్రేక్ అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయం అది. అందుకే నేను చాలా సంతోషించాను. నాలుగు రోజుల పాటు షూటింగ్ పూర్తయింది. నా షెడ్యూల్‌ను ముగిసాక ఢిల్లీకి వెళ్లా. ప్రభాస్ సినిమా నుంచి నన్ను తొలగించినట్లు తెలిసింది. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మరో తెలుగు సినిమాలోనూ ఇలాగే జరిగింది. అయితే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే తొలగించారు. ఆ తర్వాత నాకు ఇండస్ట్రీపై అవగాహన వచ్చింది. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవద్దని అనుకున్నా’ అని చెప్పారు. ఆ చిత్రం మరేదో కాదు ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’. ఈవిషయంపై నిర్మాత దిల్ రాజు కూడా గతంలో క్లారిటీ ఇచ్చారు.
Also Read: Mathu Vadalara 2: ‘మత్తువదలరా-2’ ట్విట్టర్ రివ్యూ.. నవ్వి నవ్వి పొట్ట నొప్పొచ్చిందిరా బాబోయ్!
2009లో కన్నడ చిత్రం ‘గిల్లీ’తో రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తెలుగులోకి వచ్చారు. 2014లో యారియాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో థాంక్ గాడ్, రన్‌వే 34, డాక్టర్ జి, దే దే ప్యార్ దే వంటి అనేక చిత్రాలలో నటించారు. ధృవ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, లౌక్యం, జయ జానకి నాయక లాంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇటీవల ‘ఇండియన్ 2’ చిత్రంలో రకుల్ మెరిశారు. ప్రస్తుతం ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తున్నారు.