టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నలుగురు నిందితులను జూన్ 24 నుంచి 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన బోర్లగుంట వినోద్ కుమార్, ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి, గోళ్ల రుత్యేంద్రబాబు, ఓబిలి నాగరాజును పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. నేటి నుంచి నిందితులు నలుగురిని పోలీసులు విచారించనున్నారు.
Also Read: Operation Sindhu: ఇరాన్ నుంచి.. ఢిల్లీ చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు!
ఏప్రిల్ 22న ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురయ్యారు. 22న సాయంత్రం 7.30 గంటల సమయంలో ఒంగోలులోని ఆయన కార్యాలయంలో విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసింది కిరాయి ముఠా. నిందితులు వీరయ్య చౌదరిని 53 సార్లు పొడిచి హతమార్చిన అనంతరం స్కూటీ, ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. 50 బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముందుగా అమ్మనబ్రోలు, నాగులుప్పలపాడుకు చెందిన ప్రధాన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పోలీసులు కస్టడీకి కోరారు. హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ముప్పా సురేష్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నాడు.