Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల్లో బుధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బద్వేల్, తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, తుని, నర్సాపురం, కందుకూరు, మేడికొండూరు, గుంటూరు, జలమూరు ఎమ్మార్వో ఆఫీసు, శ్రీకాకుళంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు నిర్వహించింది.ఏసీబీ 14400 నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కీలకమైన ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. పలువురు సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ దాడులకు ప్రాధాన్యం సంతరించుకుంది. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
Read Also: TDP Leader: బాలిక ఆత్మహత్య కేసు.. టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్‌కు జీవిత కాల శిక్ష
నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి నేతృత్వంలోని బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. నివాస గృహాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య పరమైన భారీ భవంతుల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంలో, కొన్ని భవనాలను క్రమబద్ధీకరించడంలో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఫోన్‌కాల్ ఫిర్యాదు ఆధారంగా ఆకస్మిక తనిఖీకి ఏసీబీ అధికారులు వచ్చారు. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలోకి వెళ్లి తలుపులు మూసి రికార్డులను తనిఖీ చేశారు. రెండు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు.