Earthquake సోమవారం తెల్లవారు జామున టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం విలయాన్ని సృష్టించింది. ఈ భారీ భూకంపం కారణంగా 670 మందికి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 4:17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టర్కీలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం సంభవించిన కొన్ని నిమిషాల తర్వాత మరోసారి 6.7 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావడంతో.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం సిరియాలో భవనాలు కూలి 386 మంది చనిపోయారు. సిరియా సరిహద్దుకు 40 కిలోమీటర్ల (25 మైళ్లు) దూరంలో ఉన్న టర్కీ నగరమైన గాజియాంటెప్ సమీపంలో తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురైన నివాసితులు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్లు ఉత్తర సిరియాలోని అధికారులు వెల్లడించారు.
భూకంపం కారణంగా సిరియాలోని ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అలెప్పో, హమా, లటాకియా మరియు టార్టస్ నగరాల్లో కనీసం 239 మంది మరణించారు. కనీసం మరో 648 మంది గాయపడ్డారని ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో, కనీసం 147 మంది మరణించారు. 340 మందికి పైగా గాయపడ్డారని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. సిరియా జాతీయ భూకంప కేంద్రం అధిపతి రేద్ అహ్మద్ ప్రభుత్వ రేడియోతో మాట్లాడుతూ “చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపం” అని అన్నారు. టర్కీలో కనీసం 284 మంది మరణించారు, వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఓక్టే సోమవారం మాట్లాడుతూ..2,300 మందికి పైగా గాయపడ్డారని, అనేక ప్రధాన నగరాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అన్నారు.
Asifabad Bus accident: బస్సునుంచి బయటకు దూకిన డ్రైవర్.. కారణం ఇదే..
శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు కాబట్టి.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. టర్కీలో మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో, దియర్‌బకీర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉండగా.. సిరియాలో అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు వెంటనే చేరుకొని, సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు.. ఈ భారీ భూకంపం దెబ్బకు ప్రజలందరూ తమ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఇళ్లల్లోకి వెళ్లొద్దని సూచించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అలాగే.. సహాయక చర్యలు చేపట్టాలని, బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. ఇదిలావుండగా.. టర్కీలో భూకంపాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయి. 2020లో జనవరి నెలలో ఇలాజిగ్ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయాలపాలయ్యారు.