Site icon NTV Telugu

2027 World Cup: రోహిత్, కోహ్లీలు వన్డే ప్రపంచకప్‌లో ఆడరు!

Rohit Sharma, Virat Kohli

Rohit Sharma, Virat Kohli

2027 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడడం డౌటే అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. మెగా టోర్నీకి చాలా సమయం ఉందని.. అప్పటివరకు ఇద్దరు తమ ఫామ్, ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటారో చూడాలన్నాడు. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడంతో కోహ్లీ, రోహిత్‌లను జట్టు నుంచి పక్కన పెట్టేసినట్లు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడమే అని ఏబీడీ పేర్కొన్నాడు. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఆడనున్నారు. ఏడు నెలల తర్వాత భారత జట్టులోకి రావడంతో దిగజాల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘2027 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడుతారనే నమ్మకం లేదు. శుభ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా చేయడం అందులో భాగమే కావచ్చు. గిల్‌ యువ ఆటగాడు, అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు గొప్ప నాయకుడు. గిల్‌కు ఇదే మంచి అవకాశం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉండటం మంచి విషయం. ఇద్దరు దిగజాల నుంచి ఎన్నో విషయాలు గిల్ నేర్చుకుంటాడు. భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌ వినోదభరితంగా ఉంటుంది. మంచి ప్లేయర్స్ టీమిండియాలో ఉన్నారు’ అని అన్నాడు.

Also Read: Perni Nani: స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదంట.. వైఎస్ జగన్ వెళ్లి చూపిస్తారు!

‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. టీమిండియా కోసం మరో ప్రపంచకప్ ఆడటానికి ఎదురుచూస్తున్నారు. ఇది మంచి విషయమే అయినా.. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. నిజం చెప్పాలంటే.. ఇది వారి ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి క్రికెట్ ఆడుతూ.. 2027 వరకు కొనసాగడం చాలా అవసరం. మెగా టోర్నీ ఆరంభానికి చాలా సమయం ఉంది. కోహ్లీ, రోహిత్ ఫామ్‌ను కాపాడుకుంటూ తామున్నామంటూ సెలెక్టర్లకు సందేశం ఇవ్వాలి. ఇద్దరు లెజెండ్స్. రోహిత్, కోహ్లీలు ఎప్పుడూ నా జట్టులో ఉంటారు. వారికి నేను ఎప్పుడైనా అవకాశం ఇస్తా’ అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో పాకిస్తాన్‌పై ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్.. సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 84 పరుగులు కూడా చేశాడు. మరోవైపు రోహిత్ శర్మ టోర్నమెంట్ అంతటా ఇబ్బంది పడ్డాడు కానీ.. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 76 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. కెప్టెన్సీ బాధ్యత లేని రోహిత్.. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఎలా ఆడతాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడు మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశాలు ఉన్నాయని మాజీలు అంటున్నారు.

 

Exit mobile version