Aarogyasri: రాష్ట్రంలోని దవాఖానల్లో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా యాజమాన్యాలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి సేవలు నిలిపివేశాయి. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించపోవడంతో రూ.1400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. త్వరగా మొండి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా టీఏఎన్‌హెచ్‌ఏ అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్ మాట్లాడారు. గత 20 రోజులుగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహా, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులతో అసోసియేషన్ అనేక దఫాలుగా చర్చలు జరిపిందన్నారు. ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిశీలిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ చెల్లింపుల పంపిణీలో జాప్యం కొనసాగుతుందన్నారు.
READ MORE: India US Trade Deal: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు.. ఢీల్ కుదిరేనా?