Shraddha Walker Case: శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడిపై ఆరోపణలను ధ్రువపరిచే ఆధారాలను ఢిల్లీ పోలీసులు కోర్టులో వెల్లడించారు. ఈ వాదనలో పోలీసులు కీలక విషయాలను తెలిపారు. శ్రద్ధా వాకర్‌ను ముందుగా బెదిరించిన తీరులోనే హతమార్చాడని వివరించారు. తన గొంతు నులిమి చంపేసి, ఆ తర్వాత ముక్కలుగా నరికేస్తానని బెదిరించినట్టు శ్రద్ధా వాకర్ ఆమె మరణానికి ముందు మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఢిల్లీకి మారిన తర్వాత అదే తీరులో శ్రద్ధా వాకర్‌ను అఫ్తాబ్ పూనావాలా చంపేశాడు. ఢిల్లీ పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌పీపీ) అమిత్ ప్రసాద్ అదనపు సెషన్స్ న్యాయమూర్తి ముందు మంగళవారం వాదనలు వినిపించారు. మహారాష్ట్రలోని బసాయ్ పోలీసులకు శ్రద్ధా వాకర్ ఓ ఫిర్యాదు చేశారని, అందులో అఫ్తాబ్ తనను గొంతు నులిమి చంపేస్తానని, ఆ తర్వాత తనను ముక్కలుగా నరికేస్తానని బెదిరించాడని పేర్కొంది. అఫ్తాబ్ పూనావాలా అదే తీరులో శ్రద్ధా వాకర్‌ను చంపేశాడు.
మహారాష్ట్రలోని ముంబయిలో అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధావాకర్ జంట మూడు చోట్లలో అద్దెకు ఉన్నాయి. వాటికి సంబంధించిన రెంట్ అగ్రిమెంట్లతో పాటు సాక్ష్యులు కూడా ఉన్నారు. శ్రద్ధా, అఫ్తాబ్ కలిసి పనిచేసేవారు కావున.. వారితో కలిసి పనిచేసే వారు సాక్ష్యులుగా ఉన్నారు. కానీ శ్రద్ధా వాకర్, అఫ్తాబ్ మధ్య సంబంధం అంతా బాగోలేదనే విషయంపై కూడా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఢిల్లీకి మారడానికి ముందు మహారాష్ట్రలో ఉన్నప్పుడే శ్రద్ధా వాకర్.. అఫ్తాబ్ పూనావాలాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అభిప్రాయ బేధాలు, విభేదాలు ఉన్నప్పటికీ కలిసి జీవించడానికే మొగ్గు చూపారు. శ్రద్ధా వాకర్ ఓ మెడికల్ సర్వీస్ యాప్ ద్వారా సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా తీసుకుంది. వారి సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లు పర్యటించారని ఎస్‌పీపీ పేర్కొన్నారు. ఇది వారి మధ్య సంబంధమే కాదు.. అఫ్తాబ్ పూనావాలా ప్రవర్తననూ నిరూపణ చేస్తోందని వాదించారు.
ఢిల్లీలో వారు నివసిస్తున్నప్పుడు కూడా తరుచూ గొడవపడేవారని పొరుగువారి ద్వారా తెలుస్తున్నదని పోలీసులు కోర్టుకు తెలిపారు. కొన్నిసార్లు శ్రద్ధా వాకర్ ఇల్లు విడిచి వెళ్లిపోయేది. పొరుగు వారు ఆమెను ఆపి వెనక్కి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఆ తర్వాత అంతా మౌనంగా గడిచిపోయింది. ఆమెను ఎవరూ చూడలేదు. ఎవరూ మాట్లాడలేదు. శ్రద్ధా వాకర్ హత్య తర్వాత వారిద్దరి బ్యాంకు అకౌంట్ల మధ్య ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సాయంత్రం సుమారు 6.40 నుంచి 6.42 గంటల సమయంలో శ్రద్ధా వాకర్ బ్యాంక్ అకౌంట్ నుంచి మొత్తం రూ 54 వేలు తన అకౌంట్‌లోకి అఫ్తాబ్ పూనావాలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. కాల్ రికార్డులను పరిశీలిస్తే.. శ్రద్ధా వాకర్ ఫ్రెండ్ ఆమెకు చేసిన ఓ కాల్‌కు ఆన్సర్ ఇవ్వలేదు. ఆ తర్వాత అఫ్తాబ్ ఆ నెంబర్‌కు కాల్ చేసి ఆమె బిజీగా ఉన్నదని సమాధానం చెప్పాడు. అంటే.. శ్రద్ధా ఫోన్ అఫ్తాబ్ వినియోగించాడు.ఆ తర్వాత ఆ ఫోన్ నుంచి ఏ కాల్ లేదు. ఆమె హత్య 2022 మే 18న జరిగినట్టు భావిస్తున్నారు.
Read Also: Mother Attack Daughter: ఇష్టం లేని పెళ్లి.. కూతుర్ని చంపేందుకు తల్లి కుట్ర
శ్రద్ధా వాకర్ ఓ ఫ్రెండ్‌ను కలవడానికి గురుగ్రామ్ వెళ్లింది. మే 18న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆమె తిరిగి వచ్చింది. ఓ ఆటో డ్రైవర్ ఆమెను డ్రాప్ చేశాడు. మొత్తం లొకేషన్ మ్యాప్ అంతా ఉన్నదని, దాని ప్రూఫ్‌ను ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2022 మే 18న అఫ్తాబ్ పూనావాలా ఒక రంపం, ఒక చాపర్, చెత్త కవర్లు, ఇతర వస్తువులను కొన్నాడు. మే 19న ఓ డబుల్ డోర్ ఫ్రిడ్జీని తన క్రెడిట్ కార్డుతో కొన్నాడు. దాని స్టాండ్‌ను రూ. 250ను శ్రద్ధా అకౌంట్ నుంచి చెల్లించి కొనుగోలు చేశాడు. ఇది ఆమె ఫోన్‌ను అఫ్తాబ్ ఆ తర్వాత కూడా వినియోగించినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఆమె ఖాతా ద్వారా ఇతరులతో చాట్ చేశాడు. తద్వార ఆమె ఇంకా బ్రతికే ఉన్నట్టు క్రియేట్ చేశాడు. ఆమె మరణించిన తర్వాత అఫ్తాబ్ మరో యువతితో రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడు. ఆ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌కు గతంలో శ్రద్ధా వాకర్‌కు ఇచ్చిన రింగ్‌ను బహూకరించాడు. కొంతమంది ఆ రింగ్‌ను గుర్తుపట్టారు కూడా అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆరోపణలపై వాదనలను మార్చి 20వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫైల్ చేసిన సినాప్సిస్ రికార్డులోకి తీసుకుని దానికి సమాధానం ఇవ్వడానికి లీగల్ ఎయిడ్ కౌన్సెల్ జావేద్ హుస్సేన్‌కు సమయాన్ని మంజూరు చేసింది.