Aadi Srinivas : గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దేశానికి త్యాగాలు చేసిన కుటుంబాన్ని “డూప్లికేట్ గాంధీ కుటుంబం” అంటూ మాట్లాడడం తగదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ జైలు పాలయ్యారు, తన ఆస్తులన్నీ దేశం కోసం ధారపోశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని వదిలిపెట్టారు. రాహుల్ గాంధీ నిస్వార్థంగా దేశం కోసం పని చేస్తున్నారు. అలాంటి కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం,” అని ఆయన అన్నారు.
బీజేపీ దేశం కోసం చేసింది ఏమిటి? అని ప్రశ్నించిన ఆది శ్రీనివాస్, “దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక్క బీజేపీ నాయకుడిని బండి సంజయ్ చూపించగలడా?” అని సవాల్ విసిరారు. బీజేపీ గురించి మాట్లాడుతూ, “ఇప్పుడు మనం చూస్తున్నది అసలు బీజేపీ కాదు. వాజపేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకుల బీజేపీ ఇప్పటికీ ప్రజల మదిలో ఉంది. కానీ ఇప్పుడున్నది నకిలీ బీజేపీ, నకిలీ నాయకులతో నిండిపోయింది,” అని విమర్శించారు.
“కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ రాష్ట్రంలో అల్లర్లు జరగాలని కోరుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాంటి ప్రమాదాలు ఉంటే ఆయనే ముందుగా అధికారికంగా సమాచారం ఇవ్వాలి. మజ్లిస్ ను బూచి చూపించి బీజేపీ ఇంకెంత కాలం రాజకీయంగా బతుకుతుందో చూడాలి,” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ భవిష్యత్తు పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ఆది శ్రీనివాస్, “సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. 400 సీట్లు గెలుస్తామని హడావుడి చేసిన బీజేపీ చివరకు 240 సీట్లకే పరిమితమైంది,” అని పేర్కొన్నారు.
GT vs DC: వాహ్.. ఢిల్లీ బ్యాటర్ల సమష్టి కృషి.. .. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 204