Missing: తన కూతురు మిస్సయి నెల రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించడం లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డ్యూటీకి వెళ్తున్నానని చెప్పిన కూతురు ఇంటికి చేరుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరంట్స్.. దర్యాప్తు చేపట్టినా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఈ సంఘటన శంషాబాద్ పోలీస్టేషన్ పరిధి నర్కుడా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. నర్కుడా గ్రామానికి చెందిన వెంకటమ్మ, షామ్ దంపతుల కూతురు ప్రవళ్లిక డిగ్రీ వరకు చదివి ఆపేసింది. అయితే ఈ మధ్య గండిగుడా వద్ద గల ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.
Read Also: Ginger: ఓ నెల మొత్తం అల్లం తింటే ఏమవుతుందో తెలుసా?
అయితే, జనవరి 22వ తేదీన డ్యూటీకి వెళ్తున్నానని చెప్పిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తెలిసిన చోటల్లా వెతికిన ఆచూకీ దొరకలేదు. దాంతో శంషాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రవల్లిక ఉద్యోగం చేసే కంపెనీలో ఉద్యోగం చేసే నర్సింహా అనే వ్యక్తిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నర్సింహా స్వస్థలం మహేశ్వరం. అతనికి వివాహమై సంవత్సరం అయిందని తెలుస్తుంది. నర్సింహా పై అదే రోజు మహేశ్వరం పోలీస్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు తెలిసింది. ప్రవళ్లిక ను నర్సింహా తీసుకెళ్లాడా? లేదంటే ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.