Anantapur Crime: ప్రేమ విఫలమైందని అనంతపురంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం శివారు కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలోని ఓ ఇంటిలో వాసుదత్త అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వాసుదత్త అనే యువకుడు ఇంటికి సమీపంలోనే ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి నిన్నటి రోజున పెన్నహోబిలంలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన యువతి ఒక్కసారిగా వాసుదత్త తనను ఇబ్బంది పెడుతున్నారని తన ప్రేమను నిరాకరించింది. దీంతో, మనస్థాపం చెందిన వాసుదత్త ఇంటికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రేమ విఫలమైందని.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుని.. కన్నవారికి పుట్టెడు దుఖం మిగులుస్తున్నారు కొందరు యువకులు.. చేతికి అందివచ్చిన కొడుకు.. తమకు అండగా ఉంటాడని తల్లిదండ్రులు భావించే సమయంలో.. వారికి కడుపుకోతను మిగిలిస్తున్నారు..