Duplicate Finger Prints: సైబర్ నేరగాలు చెలరేగి పోతున్నారు.. కొత్త కొత్త తరహాలో దోచేస్తున్నారు.. ఏదో రకంగా ఎరవేయడం.. దొరికినవారి నుంచి అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. చివరకు వేలి ముద్రలను సేకరించి.. వాటి ద్వారా కూడా దోపిడీకి పాల్పడుతోన్న ముఠా.. పోలీసులకు చిక్కింది.. వేలిముద్రలు సేకరించి, వాటితో సొమ్ము దోచుకుంటున్న పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి.. ఈ ముఠా రూ.51.25 లక్షలు దోచేసినట్లు గుర్తించారు పోలీసులు..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు రూరల్‌కి చెందిన ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఇటీవల కొంత నగదు విత్‌డ్రా అయ్యింది.. అయితే, ఆమె ఫోన్‌కు ఎలాంటి ఎస్‌ఎంఎస్ రాలేదు.. కానీ, బ్యాంకు ఖాతాను పరిశీలిస్తే అందులో ఉన్న నగదు మొత్తం మాయం అయ్యింది.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు.. ఇక, నెల్లూరు గ్రామీణం, సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు.. ప్రకాశం జిల్లా దోర్నాల మండలానికి చెందిన ఎన్.వెంకటేశ్వర్లు, టి.మధుసూదన్‌రెడ్డి, డి.ఆనంద్‌రావు, ఎం.సాయికుమార్‌రెడ్డి, ఆర్.శ్రీనివాసులు, ఎస్‌కే ఉమర్, సీహెచ్ సన్నీ, ఎం.యువరాజ్, ఎన్.సుధాకర్, పి.రవీంద్ర కలిసి.. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రజల వేలిముద్రలు సేకరించినట్లు దర్యాప్తు తేలింది.. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఆధారంగా వేలిముద్రలతో ఆయా ఖాతాల్లో నగదు దోపిడీకి తెర లేపారు కేటుగాళ్లు.. ప్రత్యేక యాప్స్ ద్వారా వేలిముద్రల ఆధారంగా ఖాతాల్లో ఉన్న నగదు గుట్టుగా లేపేశారు.. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నారు. ఇక, ఈ ముఠాలో కర్నూలు జిల్లాకు చెందిన డాక్యుమెంటు రైటర్ కూడా ఒకరు ఉన్నట్టు తెలుస్తోంది..
ఎలా దొంగతనం చేస్తారు..?
కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇందులో కీలక నిందితుడు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పనులకు వచ్చి సాక్షులుగా సంతకాలు చేసేవారు వేలిముద్రలు తీసుకుని తమ ఆధార్ కాపీలు ఇవ్వడం ఆనవాయితీ. దీని ద్వారా, ఈ కేటుగాళ్లు వేలిముద్రలను మరియు సంబంధిత ఆధార్ కాపీలను స్కాన్ చేయడం.. స్కాన్ చేసిన వేలిముద్రలతో బ్యాంకింగ్ కియోస్క్ టెక్నాలజీతో డబ్బును దోచేశారు..
బాధితులకు తెలియదా..?
బాధితుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజలు. బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను సెల్‌ఫోన్‌లో ఎప్పటికప్పుడు చూసే అలవాటు కూడా లేనివారున్నారు.. అందుకే బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ అయినా వారికి తెలియదు. దీంతో ఈ దొంగల పని సులువైంది. బాధితురాలి ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు రంగంలోకి దిగారు.. ఇక్కడ బాధితులు నెల్లూరు జిల్లాకు చెందినవారే అయినప్పటికీ 10 మంది నిందితులు జిల్లాకు చెందనివారు. ఇతర జిల్లాల్లో పనులు చక్కబెట్టారు. ఆన్‌లైన్‌లో కూడా కొంత డేటా సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఇలాంటి మోసాలను నివారించేందుకు ఆధార్‌తో అనుసంధానించబడిన వేలిముద్రను నిలిపివేయాలని సూచించారు. అలా చేస్తే మన వేలిముద్రలు ఎవరికీ కనిపించవని, వేలిముద్రలతో మన ఆధార్ ను ఎవరూ వినియోగించుకోలేరని చెప్పారు.