Election Betting: బెట్టింగ్ తప్పు అని తెలిసినా కొంత మంది అదే రూట్‌లో వెళ్తున్నారు. పరువు కోసం, ఆధిపత్యం కోసం.. కారణం ఏదైనా సరే పందెం కాసి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో జరిగింది. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని గ్రామస్థులతో పందెం వేసి అప్పులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి ఏడో వార్డు సభ్యుడు. భార్య సర్పంచ్‌గా ఉన్నారు. వీరు వైసీపీ మద్దతుదారులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వివిధ గ్రామాల వారితో రూ.30 కోట్లు బెట్టింగ్ వేశారు.
Read Also: Rohit Sharma: కంటతడి పెట్టిన పాకిస్తాన్ ప్లేయర్.. ఓదార్చిన రోహిత్ శర్మ!
ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగిరాలేదు. పందెం వేసినవాళ్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. దీంతో పందెం వేసినవాళ్లు ఆయన ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి ఏసీలు, సోఫాలు, టీవీలు తీసుకెళ్లారు. ఇక దీంతో మనస్తాపానికి గురై పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వేణుగోపాల్ రెడ్డి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని పేర్కొన్నట్లు తెలిసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.