ప్రేమ బ్రతుకును కోరుకుంటుంది.. చావుని కాదు. ప్రేమ బంధాలను కోరుకుంటుంది.. తెగదెంపులను కాదు.. ప్రేమ తోడును కోరుకుంటుంది. ఒంటరి తనాన్ని కాదు. కానీ ఓ ప్రియురాలు మాత్రం.. ప్రియుడి మరణాన్ని కోరుకుంది. ఓ అమ్మాయి.. ఒకేసారి ఇద్దరి యువకులతో జరిగించిన రిలేషన్ షిప్‌లో (Triangle Love) ఒకరి ప్రాణాలు పోయాయి. ఈ దారుణ ఘటన గౌహతిలో (Guwahati) చోటుచేసుకుంది.
అంజలి-సురేష్ కాంబ్లీ ఇద్దరు గతేడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. కోల్‌కతా ఎయిర్‌పోర్టులోని ఓ రెస్టారెంట్‌లో అంజలి పనిచేస్తుండేది. అక్కడే కాంబ్లీతో అంజలికి స్నేహం ఏర్పడింది. అప్పట్నుంచీ వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే రాకేష్ అనే యువకుడితో ముందు నుంచే అంజలి ప్రేమలో ఉంది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో అంజలి ప్రేమాయాణం సాగిస్తోంది.
ఇదిలా ఉంటే తనను పెళ్లి చేసుకోవాలంటూ అంజలి.. రాకేష్‌ను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుండగా.. ఇక కాంబ్లీతో రిలేషన్‌షిప్ కట్ చేసుకుని అతని ఫోన్‌లో ఉన్న ఫొటోలను తీసేసుకోవాలని అంజలి ప్రయత్నించింది. దీని కోసం కోల్‌కతా ఎయిర్‌పోర్టుకి రావాలని కోరింది. కానీ కాంబ్లీ మాత్రం గౌహతికి రమ్మని చెప్పాడు.
దీంతో అంజలి.. రాకేష్‌ను తీసుకుని గౌహతికి వచ్చింది. గౌహతిలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో కాంబ్లీ బుక్ చేసిన గదికి అంజలి చేరుకుంది. రాకేష్ కూడా అదే హోటల్‌లో ఓ గదిలో దిగాడు. కాంబ్లీ-అంజలి ఇద్దరు మాట్లాడుతుండగా సడన్‌గా వారి గదిలోకి రాకేష్ ప్రత్యక్షమయ్యాడు. దీంతో కాంబ్లీ.. కోపోద్రిక్తుడయ్యాడు. అంతే వారి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. అంజలి.. రాకేష్ కలిసి కాంబ్లీని తీవ్రంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం కాంబ్లీకి చెందిన రెండు మొబైల్ ఫోన్లు తీసుకుని పరారయ్యారు.
హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ రిజిస్టర్, సీసీటీవీ ఫుటేజీ, విమానాశ్రయ ప్రయాణికుల జాబితాను పరిశీలించి ఇద్దరు అనుమానితులను గుర్తించారు. మరోవైపు కోల్‌కతా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా అంజలి-రాకేష్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.