మణిపూర్‌లో ఉగ్రదాడి వెలుగులోకి వచ్చింది. ఆదివారం మణిపూర్‌లోని జిరిబామ్‌లో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందంపై గుర్తు తెలియని సాయుధ దుండగులు దాడి చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ వీరమరణం పొందారు. ఈరోజు ఉదయం 9.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అధికారుల సమాచారం ప్రకారం.. సీఆర్పీఎఫ్, జిరిబామ్ జిల్లా పోలీసుల సంయుక్త బృందం ఏకకాలంలో ఆపరేషన్‌లో నిమగ్నమై ఉంది. ఇంతలో ఉమ్మడి బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు ముగ్గురు సైనికులు గాయపడినట్లు సమాచారం. అందులో ఓ జవాన్ బుల్లెట్ గాయం కారణంగా మరణించారు.
READ MORE: Trump Rally Firing:”దాడికి ముందు దుండగుడిని గుర్తించి పోలీసులకు తెలిపాం. వాళ్లు పట్టించుకోలేదు..”
మణిపూర్‌లో హింస ఆగడం లేదు..
మణిపూర్‌లోని జిరిబామ్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా హింస చెలరేగుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు, కాల్పులతో మణిపూర్ దద్దరిల్లి పోతోంది. తమను ఎస్టీల్లో చేర్చాలని మెయితీలు చేస్తున్న డిమాండ్లకు మణిపుర్ వ్యాలీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో అక్కడ ఎస్టీలుగా ఉన్న కుకీ తెగ ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఇదే ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర ఘర్షణలకు కారణమైంది. మణిపూర్‌లో ఇప్పటి వరకు జరిగిన హింసల్లో మృతుల సంఖ్య వంద దాటింది. వందల మందికి గాయాలయ్యాయి. 67,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చాలా ఇళ్లు, వాహనాలు, దుకాణాలకు ఆందోళన కారులు నిప్పంటించారు. హింసాత్మక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు.