Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. గత రెండు వారాలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన యాత్ర ప్రస్తుతం కేరళలో సాగుతోంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ వెళ్లారు. దీంతో శుక్రవారం ఒక రోజు భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. మళ్లీ సెప్టెంబర్ 24 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుకానుంది. శనివారం నుంచి జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకాగాంధీ కూడా పాల్గొననున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అధ్యక్ష పదవి గురించి చర్చించేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముఖ్యంగా రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని తీసుకువచ్చేలా కనిపిస్తున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపుగా ఖరారు అయింది. ఆయనే తప్పకుండా అధ్యక్షుడు అవుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అశోక్ గెహ్లాట్ తో పాటు శశి థరూర్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, మనీస్ తివారీ వంటి వారు పోటీలో ఉంటారనేే ప్రచారం జరుగుతోంది.
Read Also: Azharuddin: అజారుద్దీన్‌తో సహా హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు
మరోవైపు రాజస్థాన్ సీఎం అభ్యర్థిపై కూడా కాంగ్రెస్ అధినాయకత్వం చర్చించే అవకాశం ఉంది. ఒక వ్యక్తికి ఒక పదవి మాత్రమే అని రాహుల్ గాంధీ గురువారం స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ ఎన్నికైతే ఆయన రాజస్థాన్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. తదుపరి సీఎం ఎవరనేదానిపై చర్చించనున్నారు. ఇప్పటికే సచిన్ పైలెట్ సీఎం కావడానికి పావులు కదుపుతున్నారు. అయితే అశోక గెహ్లాట్ మాత్రం తనకు నమ్మకస్తుడిగా ఉన్న స్పీకర్ జోషిని ముఖ్యమంత్రి చేయాలని సిఫారసు చేశారు.
గురువారం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ విత్ డ్రాకు అక్టోబర్ 8 చివరి తేది. అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలు ప్రకటించనున్నారు.