NTV Telugu Site icon

Ex-envoy Ajay Bisaria: ఆ అర్ధరాత్రి చిగురుటాకులా వణికిన పాక్‌.. ఎందుకంటే?

Pakistan

Pakistan

Ex-envoy Ajay Bisaria: భారత్‌, పాక్‌ దాయాది దేశాల మధ్య శత్రుత్వం గురించి తెలిసిన విషయం. శత్రువు ప్రాణాలతో దొరికితే విజయగర్వంతో ఆ దేశం మీసం తిప్పుతుంది. 2019 ఫిబ్రవరి 27 భారత వింగ్ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పట్టుబడిన సమయంలో పాక్‌లో అలాంటి పరిస్థితి లేదు. పాక్‌ ప్రధానితో సహా ఉన్నతస్థాయి అధికార గణమంతా వణికిపోయారు. రెండు రోజుల్లోనే వర్ధమాన్‌ను విడిచిపెట్టింది పాకిస్థాన్‌. ఆ రోజు పాకిస్థాన్‌ ఎందుకలా భయపడిందనే విషయాలను ఆ సమయంలో పాక్‌లో భారత హైకమిషనర్‌గా పని చేసిన అజయ్‌ బిసారియా తన పుస్తకంలో వెల్లడించారు. పాకిస్థాన్‌లో భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా ‘యాంగర్ మేనేజ్‌మెంట్: ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్ షిప్ బిట్‌ఇండియా అండ్ పాకిస్థాన్’ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో అజయ్ బిసారియా బాలాకోట్ దాడుల తర్వాత భారత దౌత్య పరిస్థితులకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.

Read Also: Lalit Modi: ఆర్‌సీబీ తరఫున ఆడకుంటే.. కెరీర్‌ ముగించేస్తానని మోడీ బెదిరించాడు: టీమిండియా మాజీ పేసర్‌

ఫిబ్రవరి 27న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్థాన్‌ బంధించిన అనంతరం భారత్‌ తీవ్రం స్పందించింది. దాయాదిపైకి 9 క్షిపణులతో దాడికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పాక్‌ తీవ్రంగా భయపడింది. ఆ సమయంలో భారత్‌కు అప్పటి పాక్‌ హైకమిషనర్‌ సోహైల్‌ మహమ్మద్‌ ఇస్లామాబాద్‌లో ఉన్నారని అజయ్‌ బిసారియా తన పుస్తకంలో తెలిపారు. “ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆయన నన్ను సంప్రదించారు. ‘ ప్రధాని మోడీతో ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌లో మాట్లాడాలనుకుంటున్నారు’ అని చెప్పారు. నేను(అజయ్ బిసారియా) వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారమిచ్చాను. అప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌తో మాట్లాడేందుకు ప్రధాని మోడీ అందుబాటులో లేరని అధికారులు చెప్పారు.” అని అజయ్‌ బిసారియా ఆ పుస్తకంలో వెల్లడించారు.

భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను విడిపించుకునేందుకు క్షిపణులు ఎక్కుపెట్టినట్లు భారత్ ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ దానివల్లే అప్పటి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం భయపడిందని అజయ్‌ తన పుస్తకం వెల్లడించారు. 2019లో ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “అభినందన్‌ను పాక్‌ విడిచిపెట్టి మంచి పని చేసిందని, లేదంటే వారు భయంకరమైన రాత్రి చవిచూడాల్సి వచ్చేది” అని ఆయన అన్నారు.