Lalit Modi Threatened To End My Career Says Praveen Kumar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తన మొదటి ఎంపిక కాదని, ఇష్టం లేకపోయినా తాను ఆర్‌సీబీ తరఫున ఆడానని తెలిపాడు. ఆర్‌సీబీ తరఫున ఆడకుంటే తన కెరీర్ ముగించేస్తానని లలిత్ మోడీ బెదిరించాడని ప్రవీణ్ కుమార్ చెప్పాడు. ఢిల్లీ తన స్వస్థలమైన మీరట్‌కు దగ్గరగా ఉన్నందున ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో తాను ఆడాలనుకున్నానని చెప్పుకొచ్చాడు.
లాలాంటాప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… ‘ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో నేను ఆర్‌సీబీ తరఫున ఆడాలనుకోలేదు. ఎందుకంటే.. బెంగళూరు నా స్వస్థలమైన మీరట్‌కు చాలా దూరంగా ఉంటుంది. నాకు ఇంగ్లిష్ రాదు.. పైగా అక్కడి ఆహారం కూడా నచ్చదు. ఢిల్లీ అయితే మీరట్‌కు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) ఆడాలనుకున్నా. కానీ ఓ వ్యక్తి పేపర్‌పై నాతో సంతకం పెట్టించుకున్నాడు. అది ఐపీఎల్ కాంట్రాక్ట్ పేపర్ అని నాకు తెలియదు. ఈ విషయాన్ని లలిత్ మోడీ దృష్టికి తీసుకువెళ్తే నీ కెరీర్ ముగించేస్తానని బెదిరించాడు’ అని తెలిపాడు.
Also Read: Mohammed Shami: అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ!
బాల్ టాంపరింగ్‌పై ప్రవీణ్ కుమార్ స్పందించాడు. గతంలో ఇలాంటివి జరిగేవని, పాకిస్థాన్ బౌలర్లే ఎక్కువగా చేసేవారని తెలిపాడు. పాకిస్తాన్ బౌలర్లు రివర్స్ స్వింగ్‌ను రాబట్టేందుకు ఇలా చేసేవారన్నారు. 1990లలో ఫాస్ట్ బౌలర్లకు రివర్స్ స్వింగ్ ఒక ఆయుధంగా మారిందన్నాడు. తనకు ఉన్న డ్రింకింగ్ అలవాటు కారణంగా కోచింగ్ బాధ్యతలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ప్రవీణ్ కుమార్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ లైయన్స్ తరఫున ప్రవీణ్ కుమార్ ఆడాడు. 119 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు.