ప్రతి మనిషికి ఏదొక సమయంలో డబ్బు అవసరం ఉంటుంది. సమయానికి తెలిసిన వారు సాయం చేయకపోయినా.. బ్యాంక్‌లు రుణాలు ఇవ్వకపోయినా వెంటనే ఆన్లైన్ లోన్ యాప్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని యాప్‌లు చట్టానికి లోబడి పని చేస్తుంటే.. మరికొన్ని యాప్‌లు అక్రమాలకు పాల్పడుతున్నాయి. మనుషుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఏది నిజమో.. కాదో తెలియక ప్రజలు మోసపోతున్నారు. కొన్ని ఆన్లైన్ యాప్‌లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ యాప్‌లపై కేంద్రం కొరడా ఝుళిపించింది.
దేశ వ్యాప్తంగా 87 అక్రమ రుణ యాప్‌లను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. ఆన్లైన్ రుణ కార్యకలాపాల్లో పాల్గొన్న కంపెనీలపై 2013 కంపెనీల చట్టం ప్రకారం విచారణలు, ఖాతాల తనిఖీలు, దర్యాప్తులతో సహా నియంత్రణ చర్యలు కాలానుగుణంగా నిర్వహించబడుతున్నాయని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు.
డిసెంబర్ 1న లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రి దృష్టికి వచ్చిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2013 ప్రకారం ప్రభుత్వం ‘షెల్ కంపెనీలను’ నిర్వచించాలని యోచిస్తుందా? పనిచేయని సంస్థల పర్యవేక్షణను మెరుగుపరచడానికి, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నలో అడిగారు. దీనికి పైవిధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది.
ఉల్లంఘనలు జరిగినప్పుడల్లా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తనిఖీలు, సమ్మతి తనిఖీలు కొనసాగుతున్నాయని.. క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతున్నాయని సమాధానంలో పేర్కొన్నారు.