Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని దల్పత్‌పూర్-కాశీపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువులతో పెళ్లికి వెళుతున్న వ్యాన్‌ను వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా 8 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ట్రక్కు అతివేగంతో వెళుతూ పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. భగత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్పత్‌పూర్ రహదారిపై ఖైర్‌ఖాతా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Bomb Blast: స్వర్ణ దేవాలయం సమీపంలో భారీ పేలుడు..
ఓ కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వ్యాన్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తాకిడి తీవ్రంగా ఉండడంతో వ్యాన్‌పై నుంచి లారీ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులందరిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో మొత్తం 26 మంది ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, స్థానిక పోలీసులు, ఇతర అధికారులతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోగా.. చాలా కష్టపడి బయటకు తీయాల్సి వచ్చింది.