రాష్ట్ర ప్రజల ఎంతో ఉత్కంఠ ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ముగింపు దశకు చేరుకుంది. నేటి ఉదయం 7 గంటలకు ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా క్యూలైన్లలో వేచిఉన్నారు. అయితే.. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అవస్థలు పడ్డారు. ఎండకు క్యూలైన్లలో నిలుచొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే.. మధ్యాహ్నం 3గంటల వరకు ఉప ఎన్నికకు 59.92 శాతం పోలింగ్ జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 1,44,878 ఓట్లు పోల్ అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Also Read : Palm Oil : ఆయిల్ పామ్ సాగు కోసం అవగాహన సదస్సు.. పోడుభూముల లొల్లి..
అయితే తాజాగా.. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 ఓట్లు పోలింగ్ అయ్యాయి. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు మరో గంట మాత్రమే మిగిలింది. చివరి గంటలో భారీగా పోలింగ్ శాతం పెరగనుంది. ఇప్పటికే చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో నిల్చున్నారు. దీంతో.. 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు అధికారులు. చివరి నిమిషం వరకు ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న వారికి ఎన్నికల సిబ్బంది టోకెన్స్ ఇవ్వనున్నారు.