భారీ వర్షాల మధ్య కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 70 మంది మరణించారు. అంతేకాకుండా.. 116 మంది గాయపడ్డారు. కొండచరియల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. ప్రజలను రక్షించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన జనాలను బయటకు తీసుకురావడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో సహా పలు ఏజెన్సీలు, సైన్యం సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.
ఈ ఘటనలో ముండక్కై, చూరల్‌మల, అత్తమాల, నూల్‌పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా మంది చలియార్ నదిలో కొట్టుకుపోయారని తెలుస్తోంది. మరోవైపు.. ప్రమాదంలో గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు వైద్య బృందాలతో సహా 225 మంది సిబ్బంది మోహరించారు. అంతేకాకుండా.. రెండు వైమానిక దళ హెలికాప్టర్లు, ఒక Mi-17.. ఒక ALH (అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్) సేవలు అందించేందుకు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన ప్రతినిధి బృందాన్ని వయనాడ్‌కు తరలించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ ఘటనపై కేరళ సీఎం విజయన్ తో ప్రధాని మోడీ ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. అవసరమైన అన్ని సహాయాలు కేంద్రం చేస్తుందన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రధానమంత్రి కార్యాలయం రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50,000 అందజేయనుంది.
Chandrababu: న్యాయ విద్యార్థి చికిత్సకు సీఎం రూ. 10 లక్షల సాయం.. ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 9656938689, 8086010833 అందుబాటులో ఉంచారు. అనేక కుటుంబాలను శిబిరాలకు.. వారి బంధువుల ఇళ్లకు తరలించారు. ఈ ప్రమాదంపై వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “నేను కేంద్ర మంత్రులతో మాట్లాడతాను మరియు వాయనాడ్‌కు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించమని వారిని అభ్యర్థిస్తాను. రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్‌లలో పరిపాలనకు సహకరించాలని నేను UDF కార్యకర్తలందరినీ కోరుతున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు. ‘కొండచరియలు విరిగిపడటం.. దాని వల్ల సంభవించిన ప్రాణనష్టం తనను తీవ్రంగా వేదనకు గురిచేశాయని అన్నారు.’ కాగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పర్యటించవచ్చని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.
మరోవైపు.. ఈరోజు (మంగళవారం) కేరళలోని కాసర్‌గోడ్, కన్నూర్, వాయనాడ్, కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్, త్రిసూర్ మరియు ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. స్థానికులు.. పర్యాటకులు చాలా ముందు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.