Italy Coast: ఇటలీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అయోనియన్ సముద్ర తీరంలో శరణార్థుల పడవ ప్రమాదానికి గురై మరణించిన వారి సంఖ్య 59కు చేరుకుంది. ఘటనా సమయంలో బోటులో 100 మందికిపైగా వలసదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 40 మంది ప్రాణాలతో బయటపడగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో నెలలు నిండని చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కోస్ట్ గార్డ్ సిబ్బందితోపాటు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. పడవలోని శరణార్థులు టర్కీ, ఈజిప్టుల నుంచి వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Read Also: Iran: ఇరాన్లో మరో ఘాతుకం.. విద్యకు దూరం చేసేందుకు విద్యార్థినులపై విషప్రయోగం
కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోస్టు గార్డ్, బార్డర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చెందిన నౌకలు సహాయక చర్యలలో పాల్గొన్నాయని తెలిపారు. పడవపై వలస వచ్చిన వారు ఏ దేశస్థులో ఇంకా తెలియలేదని అన్నారు. పడవ ఎక్కడ నుంచి వచ్చిందో కూడా ఇంకా తెలియలేదని చెప్పారు ఐరోపా తీరాలకు చేరుకోవాలనుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు ఆఫ్రికా నుంచి ఇటలీకి మధ్యధరా సముద్రాన్ని దాటుతున్నారు. 59 మంది బాధితుల్లో 12 మంది పిల్లలు, నవజాత శిశువుతో సహా 33 మంది మహిళలు ఉన్నారని క్రోటోన్ రెస్క్యూ సెంటర్ తెలిపింది. 100 మీటర్ల బీచ్లో చెక్క శిధిలాలు పడి ఉన్నాయి, అక్కడ చాలా మంది రక్షకులు మోహరించారని తెలిసింది.