Terrorists Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. బ్లైండ్ కర్వ్, ఎగుడుదిగుడుగా ఉన్న రహదారి కారణంగా ఈ సమయంలో ఆర్మీ వాహనాలు వేగాన్ని తగ్గించడంతో పూంచ్ జిల్లాలోని ధాత్యార్ మోర్హ్ ప్రదేశాన్ని ఉగ్రవాదులు దాడి చేయడానికి ఎంచుకున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఉన్న కొండపై నుంచి దాడి చేసినట్లు తెలిసింది. అక్కడ నుంచి వారు రెండు ఆర్మీ వాహనాలపై బుల్లెట్ల వర్షం కురిపించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
Read Also: Uttarapradesh : దారుణం.. రూ. 200 తిరిగి ఇవ్వలేదని బట్టలు తీసి చితకబాదిన స్నేహితులు..
రెండు ఆర్మీ వాహనాలలో ఒక ట్రక్కు, ఒక మారుతి జిప్సీలపై మెరుపుదాడి చేశారు ఉగ్రవాదులు. వారిలో ముగ్గురు లేదా నలుగురు దాడిలో పాల్గొన్నట్లు ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్మీ వాహనాలు బ్లైండ్ కర్వ్ వద్ద వేగం తగ్గించినప్పుడు ధాత్యార్ మోర్ వద్ద ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. భద్రతా బలగాలు కాల్పులు జరిపిలోపే.. ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్‌ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది.