Car Falls Into Gorge: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చౌపాల్ తహసీల్ నెర్వా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు నెర్వా గ్రామానికి వెళుతుండగా లోయలో పడిపోయిందని, నెర్వాకు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని సిమ్లా ఎస్పీ సంజీవ్ గాంధీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Read Also: Abandoned Dogs: దారుణం.. ఇంట్లోనే 1000 కుక్కల కడుపు మాడ్చి.. చనిపోయేంతవరకు!
చెట్టును ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి
మరో విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని టికామ్‌గఢ్‌లోని జాతర రోడ్డులో బుధవారం కారు చెట్టును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సబ్ డివిజనల్ పోలీసు అధికారి అభిషేక్ గౌతమ్ తెలిపారు. కారును అతివేగంగా నడపడంతో డ్రైవర్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులందరినీ జిల్లాలోని రాజ్‌నగర్ గ్రామంలోని తికమ్‌గర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మృతులు, క్షతగాత్రులు మావై గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు.