Chandrababu Meeting: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆయన నాలుగు రోజుల క్రితం కందుకూరులో రోడ్ షో నిర్వహించగా తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే ఇవాళ చంద్రబాబు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో వస్త్రాల పంపిణీకి నిర్వహించిన బహిరంగసభలో మరోసారి తొక్కిసలాట చోటుచేసుకుంది.ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారు గోపిరెడ్డి రమాదేవి, సయ్యద్ ఆసియాగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే సభా నిర్వాహకులపై స్థానికులు మండిపడుతున్నారు. నూతన సంవత్సరం తొలిరోజే గుంటూరులో ఈ ఘటన జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. చంద్రబాబు సభలో తొక్కిసలాట కారణంగా ముగ్గురు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయాలయ్యాయి. జీజీహెచ్ లో 15 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలువురిని టీడీపీ నేతలు ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. సంక్రాంతికి వస్త్రాలు పంపిణీ చేస్తామని టీడీపీ గత పది రోజులుగా ప్రచారం చేస్తోంది.
గుంటూరులో నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో ఈ ఘటన జరిగింది. చంద్రబాబు సభ ముగిసి ఆయన వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగింది. గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు టీడీపీ నేతలు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఊపిరాడక ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో సభ నిర్వాహకులు, చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ నిర్వాహకులపై ప్రజలు మండిపడుతున్నారు. పండుగ రోజు తీసుకువచ్చి మమ్మల్ని చంపుదాం అనుకున్నారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగానిలుస్తుందన్నారు. గుంటూరు ఘటనపై మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. నిన్న కందుకూరులో 8 మంది మృతి చెందారని.. నేడు గుంటూరులో ఇప్పటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి ! అంటూ మండిపడ్డారు. చంద్రన్న కానుక పేరుతో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు చనిపోయారని.. 30 వేల మందిని సమీకరించి కనీస ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు. కందుకూరు ఘటన తర్వాత కూడా చంద్రబాబుకు జ్ఞానోదయం కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరామర్శించిన మంత్రి విడదల రజిని
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు గాయపడిన వారిని పరామర్శించారు. వారికి పూర్తి చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఏదో కానుకలు ఇస్తామని ఫేక్ ప్రచారం చేశారని.. వాహనాలు పెట్టి జనాలను తరలించారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ప్రచార యావ, అధికార దాహంతోనే ఈ దారుణానికి కారణమయ్యారని ఆరోపించారు. ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్ చేశారు.