Volunteers Resignation: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్.. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు.. అయితే, వాలంటీర్లపై అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చాయి విపక్షాలు.. కొన్ని సందర్భాల్లో కొందరు ఘటనలు ఉదహరిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా.. విపక్షాలకు చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. వాటిపై మండిపడుతూ.. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు వాలంటీర్లు.. ఇక, ఎన్నికల తరుణంలో మరోసారి వాలంటీర్లపై విమర్శలు పెరిగాయి.. ఈ నేపథ్యంలో.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పలు వార్డులకు చెందిన వాలింటీర్లు సామూహిక రాజీనామాలు చేశారు.
Read Also: Shubman Gill Fine: శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్.. 12 లక్షల జరిమానా!
రాజమండ్రి క్వారీ మార్కెట్ సమీపంలో ఉన్న 1వ వార్డు, 47, 48, 49, 50 వార్డులకు చెందిన 28 మంది వాలంటీర్ల తమ పదవులకు రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. 2019 నుంచి నిస్వార్ధంగా ఎలాంటి లంచాలు తీసుకోకుండా పనిచేస్తున్న మమ్మల్ని… ప్రతిపక్షాలైన తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీలు మాటలతో హింసిస్తున్నారు.. అందుకే మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించారు వాలంటీర్లు.. మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది సరిపోనప్పుడు.. కరోనా సమయంలో మాకు అప్పజెప్పిన 50 కుటుంబాలకు మేం మెడిసిన్ అందించాం.. విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా పనిచేసిన మాపై ఇలాంటి విమర్శలు చేయడం బాధ కలిగిస్తోంది అంటున్నారు వాలంటీర్లు. మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటూ కొందరు వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుండగా.. మరికొందరు వాలంటీర్లు.. రాజీనామా చేసి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విషయం విదితమే.