ఓ యువకుడు బంఫరాఫర్ కొట్టేశాడు. 19 ఏళ్ల వయసులో రెండు పెళ్లుళ్లు చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని ముగ్గులోకి దించి.. ఇద్దర్నీ 20 రోజుల వ్యవధిలో మనువాడాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
బీహార్‌లోని జముయ్ జిల్లాలో 19 ఏళ్ల యువకుడు నెల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు సందర్భాల్లో మహిళలను కలవడానికి ఇంటికెళ్లి రెండుసార్లు పట్టుబడ్డాడు. ఆ తర్వాత గ్రామస్తులు అతనికి ఇద్దరిని ఇచ్చి వివాహం చేశారు. జముయిలోని మలయ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కేసు నమోదైంది. 19 సంవత్సరాల వయస్సులో ఒక యువకుడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నట్లు ఫిర్యాదు అందింది.
వినోద్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు అక్షర గ్రామ నివాసి. యువకుడు లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్‌కాడిహ్ గ్రామానికి చెందిన ప్రీతి కుమారితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ మహిళకు అప్పటికే వివాహమై ఒక బిడ్డ ఉంది. కానీ ఆమె వినోద్‌తో ప్రేమలో పడింది. భర్త, బిడ్డను పట్టించుకోకుండా ప్రేమలో పడింది. వినోద్ కుమార్.. ప్రీతి కుమారిని కలవాలని ప్లాన్ చేసి ఏప్రిల్ 22న ఆమెను కలవడానికి ఆమె ఇంటికి వచ్చాడు. యువకుడు.. ఆమె ఇంటికి రాగానే గ్రామస్తులు గమనించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దరిని గుడికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేశారు. ఆ మహిళతో ఇంటికి వచ్చి కాపురం చేస్తున్నాడు.
అయితే ఈ ప్రేమకథలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రీతి కుమారితో పెళ్లి కాకముందే వినోద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వినోద్ తన గ్రామంలో డీజేలో పని చేస్తున్నాడు. డీజేలో పని చేసే ఒక మహిళా సింగర్ గిరిజా కుమారితో పరిచయం ఏర్పడింది. ఒకరి కొకరు మాట్లాడుకోవడం.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ప్రేమలో పడ్డారు. ప్రీతి కుమారితో వివాహమైనప్పటికీ గిరిజాతోనూ సన్నిహితంగా ఉన్నాడు. ఈ విషయాన్ని మొదటి భార్యకు తెలియకుండా మెయింటెన్స్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఒకరోజు గిరిజా కుమారిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. దీన్ని గమనించిన గ్రామస్తులు.. ఇద్దర్ని ఆలయానికి తీసుకెళ్లి మ్యారేజ్ చేశారు. మొత్తానికి 20 రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచాడు. తన భర్త రెండో పెళ్లి చేసుకోవడంపై మొదటి భార్య ప్రీతి కుమారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రెండో భార్య గిరిజా చెప్పడం విశేషం. కలిసి జీవించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని రెండో భార్య వెల్లడించింది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.