ఆస్ట్రేలియాలో యువ క్రికెటర్ హఠాన్మరణం చెందాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి మెడకు తాకడంతో 17 ఏళ్ల బెన్ అస్టిన్ మృతి చెందాడు. ఈ ఘటనతో క్రీడా ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. దేశవాళీ ఆటగాడు అస్టిన్ మృతిపై క్రికెటర్స్, మాజీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పదకొండేళ్ల కిందట ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్.. తలకు బంతి తాకి మరణించిన విషయం తెలిసిందే. అస్టిన్ కూడా అదే మాదిరిగా మృతి చెందాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున ఆడాలనే తన కలను నెరవేర్చుకోవడానికి బెన్ అస్టిన్ శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మెల్బోర్న్ ఫెర్న్ట్రీ గల్లీలోని వ్యాలీ ట్యూ రిజర్వ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. హెల్మెట్ ధరించిన అస్టిన్.. బౌలింగ్ మెషిన్ ముందు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఓ బంతి దోసుకొచ్చింది. అతడి తల-మెడ మధ్యలో బంతి బలంగా తాకింది. దాంతో అతడు మైదానంలోనే కుప్పకూలాడు. ఆస్టిన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మోనాష్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినా.. బుధవారం అస్టిన్ మరణించాడు. ఈ విషయాన్ని గురువారం ఉదయం ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: 7300mah బ్యాటరీ, 50MP ట్రిపుల్ రేర్ కెమెరా.. OnePlus 15 భారత్ లాంచ్ డేట్ వచ్చేసింది!
‘బెన్ అస్టిన్ మరణం మాకు చాలా బాధ కలిగించింది. అతని మరణం మా క్రికెట్ కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. అస్టిన్ కుటుంబ సబ్యులకు సంతాపం ప్రకటిస్తున్నాం’ అని ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో పేర్కొంది. అస్టిన్ తమ క్లబ్ స్టార్ క్రికెటర్ అని, అద్భుతమైన నాయకుడు తెలిపింది. ముల్‌గ్రేవ్, ఎల్డాన్ పార్క్ క్రికెట్ క్లబ్‌లకు కూడా అతడు ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్ బ్యాట్ పట్టకముందు వేవర్లీ పార్క్ హాక్స్ తరపున జూనియర్ ఫుట్‌బాల్ ఆడాడు.