Train Accident in Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. దక్షిణ పాకిస్థాన్‌లో ఆదివారం రైలు పట్టాలు తప్పడంతో దాదాపు 15 మంది మరణించారని ఆ దేశ రైల్వే మంత్రి తెలిపారు. హజారా ఎక్స్‌ప్రెస్ కరాచీ నుంచి అబోటాబాద్‌కు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్షా నగరంలోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో ఓ కోచ్ పూర్తిగా బోల్తా పడింది. దీంతో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
“ఇది చాలా పెద్ద ప్రమాదం. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. దాదాపు 15 మంది ప్రయాణికులు మరణించారు. 45 మంది గాయపడ్డారు” అని ఆ దేశ రైల్వే మంత్రి ఖవాజా సాద్ రఫీక్ విలేకరులతో అన్నారు. “హజారా ఎక్స్‌ప్రెస్ కరాచీ నుంచి అబోటాబాద్‌కు వెళ్తుండగా, ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయి” అని రైల్వే అధికారి మొహ్సిన్ సియాల్ అన్నారు. అనేక మంది ప్రయాణికులు మరణించారని, ఘటనా స్థలానికి రిలీఫ్ రైలును పంపించామని ప్రావిన్షియల్ రైల్వే అధికారి ఇజాజ్ షా తెలిపారు.
Also Read: CM Jagan: ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి
పాకిస్తాన్ పురాతన రైల్వే వ్యవస్థలో తరచుగా ప్రమాదాలు, పట్టాలు తప్పడం జరుగుతుంది. జూన్ 2021లో సింధ్‌లోని దహర్కి సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 65 మంది మరణించగా.. 150 మంది గాయపడ్డారు. ఆ ప్రమాదంలో, ఎదురుగా ఉన్న ట్రాక్‌పైకి ఒక ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పగా.. ఒక నిమిషం తర్వాత రెండవ ప్యాసింజర్ రైలు ఆ శిథిలాలను ఢీకొట్టింది. 2019 అక్టోబర్‌లో తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 75 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఘోట్కీ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 2005లో 100 మందికి పైగా మరణించారు.