Cheetahs From South Africa: దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలతో కూడిన రెండో బ్యాచ్ ఫిబ్రవరి 18న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కి చేరుకుంటుందని సీనియర్ అటవీ అధికారి శనివారం తెలిపారు. రెండో బ్యాచ్ చిరుతలు ఫిబ్రవరి 18న భారత్ కు రానున్నాయి. ఈ సారి మొత్తం 12 చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తీసుకు వస్తున్నారు. వీటిలో ఎన్ని మగ చిరుతలు? ఎన్ని ఆడ చిరుతలు అనే విషయం ఇంకా తెలియలేదు. వాటిని కూడా మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లోనే వదిలివేయనున్నారు. అంతకుముందు, వాటిని కనీసం నెల రోజుల పాటు ప్రత్యేక ఎన్ క్లోజర్లలో ఉంచుతారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో గ్వాలియర్‌కు అక్కడి నుంచి కునో నేషనల్ పార్క్ కు వాటిని తీసుకువస్తారు. వాటి కోసం ఇప్పటికే కునో నేషనల్ పార్క్‌లో ప్రత్యేక ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు.
ప్రస్తుత ప్రణాళికల ప్రకారం ఫిబ్రవరి 18న మరో 12 చిరుతలను కేఎన్‌పీకి తీసుకువస్తున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) జేఎస్ చౌహాన్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి ఒక బ్యాచ్ చిరుత పులులు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు 5 ఆడ, 3 మగ చిరుత పులులను భారత్ తీసుకువచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతన పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న వాటిని మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలి పెట్టారు. ప్రస్తుతం అవి కునో నేషనల్ పార్క్ లోని హంటింగ్ ఎన్ క్లోజర్లలో ఉన్నాయి.
భారత్ లో చిరుత పులులను అంతరించిపోయిన జాతిగా 1952లో నిర్ధారించారు. భారత్‌లో చివరి చిరుత ప్రస్తుత చత్తీస్‌గఢ్ లోని కోర్యా జిల్లాలో 1947లో మరణించింది. ఇటీవల భారత్‌లో మళ్లీ ఆ చిరుత జాతిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేక ఒప్పందాల ద్వారా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి వాటిని భారత ప్రభుత్వం తీసుకువస్తోంది. జనవరిలో దేశంలో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడంపై భారతదేశం, దక్షిణాఫ్రికా అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఎంఓయూ ప్రకారం, దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలతో కూడిన ప్రారంభ బ్యాచ్‌ను భారత్‌కు రవాణా చేస్తారు.