Site icon NTV Telugu

Pakistan: పాక్‌లో మరణ మృదంగం.. వేర్వేరు ఘటనల్లో 29 మంది మృతి

Pakistan

Pakistan

Pakistan: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. వజీరిస్థాన్‌లోని గుల్మిర్‌కోట్‌ ప్రాంతంలో ఓ వ్యాన్‌ కార్మికులతో వెళ్తున్న వ్యాన్‌ను ఉగ్రవాదులు పేల్చివేశారు. శనివారం షావాల్ తహసీల్‌లోని గుల్మీర్ కోట్ సమీపంలో 16 మంది కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చివేశారని డిప్యూటీ కమిషనర్ రెహాన్ గుల్ ఖట్టక్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనంలో పనిచేస్తున్న కనీసం 11 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కూలీలు మాకిన్, వానా తహసీల్‌లకు చెందినవారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Read Also: Congress Working Committee: కాంగ్రెస్‌ టాప్‌ బాడీలోకి సచిన్‌ పైలట్, శశిథరూర్‌, రఘువీరారెడ్డి

రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి

ఆదివారం ఉదయం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా కనీసం 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది గాయపడ్డారు. కరాచీ నుంచి 40 మంది ప్రయాణికులతో ఇస్లామాబాద్ వెళ్తున్న బస్సు తెల్లవారుజామున 4.30 గంటలకు ఫైసలాబాద్ హైవే (మోటార్‌వే)లోని పిండి భట్టియాన్ ప్రాంతంలో వ్యాన్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. బస్సు ఇంధన ట్యాంకర్‌ను ఢీకొనడంతో కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి.

Read Also: Himachal Pradesh: వరదలతో హిమాచల్‌ అతలాకుతలం.. రూ.200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

మోటర్‌వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) సుల్తాన్ ఖ్వాజా మాట్లాడుతూ.. “మోటార్‌వేలోని పిండి భట్టియాన్ ప్రాంతంలో ఇంధన ట్యాంక్‌తో వెళ్తున్న ఆగి ఉన్న వ్యాన్‌పై బస్సు ఢీకొట్టింది. బస్సు వెనుక నుండి దానిని ఢీకొట్టింది. రెండు వాహనాలకు తక్షణమే మంటలు అంటుకున్నాయి. కనీసం 18 మంది ప్రయాణికులు మరణించారు. మరో 16 మంది క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఐజీ తెలిపారు. బస్సులో నుంచి దూకిన ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. రెండు వాహనాలు మంటల్లో చిక్కుకోవడంతో మరికొందరు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రెండు వాహనాల డ్రైవర్లు కూడా చనిపోయారు.

బస్సు డ్రైవర్ నిద్రమత్తులో జారుకున్నాడా లేక అతివేగం వల్లే ప్రమాదం జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదని ఐజీ ఖ్వాజా తెలిపారు. వ్యాన్‌లో ఫ్యూయల్ ట్యాంక్ లేకుంటే రెండు వాహనాలకు మంటలు చెలరేగేవి కావని చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల పట్ల పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Exit mobile version