నష్టాల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ.. క్రమంగా పుంజుకుంటోందా..? ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా..?అవుననే అంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ ఆదాయం పెరిగిందని చెబుతున్నారు..ఆర్టీసీ ఆదాయం రికార్డుస్థాయిలో పెరిగిందన్నారు ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సహకారంతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు.
రాబోయే మార్చిలోపు తార్నాక ఆసుపత్రిని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు సజ్జనార్. ఆర్టీసీలో నవశకం మొదలైందన్నారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. గతంలో ఈ సంస్థను ఎక్కడ అమ్మేస్తారో…ఎక్కడ ప్రైవేట్ పరం అవుతుందో అన్న అనుమానాలు తలెత్తాయన్నారు. అయితే సీఎం కేసీఆర్.. సంస్థను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం యాజమాన్యం… పలు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. సమష్టిగా కృషి చేసి ఆదాయాన్ని పెంచడంలో పాలుపంచుకోవాలని ఆర్టీసీ చైర్మన్, ఎండీ ఉద్యోగులను కోరారు.