Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దీదీ ప్రకటనలో బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని స్పష్టంగా చెప్పింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తున్నాయి. బెంగాల్‌లో ఒంటరి పోరుకే మమత ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో పోరు మాత్రం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్ నేత, పార్లమెంట్ కాంగ్రెస్ పక్షనేతగా ఉన్న అధిర్ రంజన్ చౌదరీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెరహంపూర్ నుంచి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ని టీఎంసీ బరిలోకి దింపింది.
యూసఫ్ పఠాన్ vs అధిర్ రంజన్ చౌదరిగా ఈ పోరు ఉండబోతుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధిర్ రంజన్ గత 5 పర్యాయాలుగా ఈ స్థానం నుంచి ఎంపీగా గెలుస్తున్నారు. దీంతో మమతా నేరుగా కాంగ్రెస్‌ని ఛాలెంజ్ చేస్తోంది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, టీఎంసీ ముందుగా సీట్ల షేరింగ్ గురించి చర్చించాయి, అయితే ఈ చర్యలు అధిర్ రంజన్ వల్లే పాడయ్యాయని టీఎంసీ బహిరంగంగానే విమర్శించింది. సీఎం మమతా బెనర్జీ పాలనను విమర్శించే నేతగా అధిర్ రంజన్‌కి పేరుంది. దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకే యూసుఫ్ పఠాన్‌ని పోటీలో నిలిపిందని తెలుస్తోంది.
ఇండియా కూటమికి భారీ దెబ్బ:
రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత టీఎంసీ ఈ రోజు షాక్ ఇచ్చింది. 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఇక పొత్తు లేదని స్పష్టం చేసింది. సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్ తీరును మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. గతంలో గెలిచిన స్థానాలైనా ఈ సారి కాంగ్రెస్ గెలుస్తుందా..? అని ప్రశ్నించారు. బీజేపీ కంచుకోటల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.