Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..

  • రామ మందిర విరాళాలు దోచిన వారిని వదిలిపెట్టం..
  • యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్..
Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే, అయోధ్య రామాలయ విరాళాలు దుర్వినియోగం చేసిన కేసులో దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రాథమిక నివేదిక అందిన వెంటనే పోలీసుల చర్యలు ప్రారంభించారని ఆయన అన్నారు. దేవారియాలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజల విశ్వాసాలతో ఆటలాడేందుకు ఎవరిని అనుమతించబోమని, దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర నిరాశతో రామభక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, అయోధ్య ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని యోగి మండిపడ్డారు. అయోధ్య సనాతన ధర్మానికి ప్రతీకని, ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారాలు చేయవద్దని, ఆధారాలు ఉంటే వాటిని సిట్‌కు సమర్పించాలని, నిజానిజాలు వెలుగులోకి వచ్చాక చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండాలని ప్రతిపక్షాలకు సూచించారు.