Yasin Malik: ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పారని వెల్లడించారు. ఆగస్టు 25న ఢిల్లీ హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో మాలిక్ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఉగ్రవాదిని కలవడం తన వ్యక్తిగత చొరవ కాదని, పాకిస్తాన్‌తో తెర వెనక శాంతి ప్రక్రియలో భాగంగా భారత నిఘా అధికారుల అభ్యర్థన మేరకు జరిగిందని చెప్పారు.
అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) స్పెషల్ డైరెక్టర్ వీకే జోషి 2005లో కాశ్మీర్‌లో సంభవించిన భూకంపం తర్వాత పాకిస్తాన్ పర్యటనకు ముందు ఢిల్లీలో తనను కలిసినట్లు మాలిక్ చెప్పారు. పాకిస్తాన్ రాజకీయ నాయకత్వంతోనే కాకుండా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి సయీద్ సహా ఉగ్రవాద వ్యక్తులతో చర్చలు జపడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జోషి కోరినట్లు మాలిక్ చెప్పారు. ఉగ్రవాద నాయకులను చర్చల్లోకి తీసుకోకుంటే, పాకిస్తాన్ తో చర్చలు అర్థవంతంగా ఉండవని తనకు చెప్పినట్లు మాలిక్ పేర్కొన్నారు. ఈ అభ్యర్థన మేరకే, పాకిస్తాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సయీద్‌తో పాటు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ ఇతర నేతల్ని కలిసేందుకు తాను అంగీకరించినట్లు వెల్లడించారు.
Read Also: DUSU election: రాహుల్ గాంధీకి స్టూడెంట్స్ షాక్.. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ఘనవిజయం..
మాలిక్ పాకిస్తాన్ పర్యటన తర్వాత, భారత్ వచ్చిన తర్వాత ఈ సమావేశాల గురించి వివరించారు. ఐబీ విచారణ తర్వాత, ప్రధానిమంత్రికి నేరుగా సమావేశాల గురించి వివరించాలని తనను అడిగినట్లు మాలిక్ పేర్కొన్నారు. ఢిల్లీలో అప్పటి జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణ్ సమక్షంలో మన్మోహన్ సింగ్‌ను కలిసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఉగ్రవాదులతో వ్యవహరించడంతో తాను చూపిన కృషి, సహనం, అంకిత భావాన్ని మన్మోహన్ సింగ్ కొనియాడారని, థాంక్స్ చెప్పారని వివరించారు.
ఈ అఫిడవిట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి, సోనియా గాంధీ, పి. చిదంబరం, ఐకే గుజ్రాల్, రాజేష్ పైలట్ సహా అనేక మంది అగ్ర రాజకీయ నేతలతో తన సమావేశాల గురించి మాలిక్ సుదీర్ఘంగా ప్రస్తావించారు. మాలిక్ వాదనలు నిజమైతే, పాకిస్తాన్‌తో భారత్ శాంతి కోసం రహస్య పద్ధతులను ఎందుకు అనుసరించిందనే తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని కలిసిన తర్వాత, భారత ప్రధాని థాంక్స్ చెప్పడం రాజకీయ రచ్చకు దారి తీయవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాని నిధులతో పాటు 1990లో శ్రీనగర్‌లో నలుగురు భారత ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వారిని మాలిక్ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర హోం మంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రూబియా సయీద్ కిడ్నాప్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.